SACHIN: క్రికెట్‌ దేవుడి నిలువెత్తు విగ్రహం

SACHIN: క్రికెట్‌ దేవుడి నిలువెత్తు విగ్రహం
అబ్బురపరుస్తున్న సచిన్‌ ప్రతిమ... ఆవిష్కరించిన మహారాష్ట్ర సీఎం

క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కోట్లాదిమంది క్రికెట్‌ అభిమానులకు దేవుడైన సచిన్‌ నిలువెత్తు విగ్రహం ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఆవిష్కృతమైంది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ ఆడుతున్న భంగిమలో ఉన్న విగ్రహం ఆకట్టుకుంటోంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన సచిన్‌ విగ్రహావిష్కరణతో మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్‌ సమక్షంలోనే ఈ విగ్రహావిష్కరణ జరిగింది. సచిన్ భార్య అంజలి, కూతురు సారా కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వచ్చారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‍నాథ్ షిండే, ఎన్‍సీపీ చీఫ్, ఐసీసీ మాజీ ఆధ్యక్షుడు శరద్ పవార్, బీసీసీఐ సెక్రటరీ జైషా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఎంసీఏ అధ్యక్షుడు అమోల్ కాలే పాల్గొన్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.


ఈ ఏడాది ఏప్రిల్‌లో సచిన్‌ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో వాంఖడే స్టేడియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధోనీ దగ్గర నుంచి కోహ్లీ వరకు అందరూ సచిన్‌ను ఆరాధిస్తూ పెరిగిన వాళ్లే. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నా.. ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచినా అది ఒక్క సచిన్‌కే చెల్లింది. ఇవాళ జరిగిన విగ్రహావిష్కరణతో క్రికెట్‌ ప్రపంచంలో శత శతకాలు సాధించి ఔరా అనిపించిన సచిన్‌ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. భారత్‌లో తొలి టెస్టు జట్టు కెప్టెన్‌ సీకే నాయుడుకు మాత్రమే విగ్రహాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆ అరుదైన గౌరవం సచిన్‌కే దక్కింది. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారని కాలే తెలిపారు. ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సచిన్ పేరు మీద ఓ స్టాండ్ కూడా ఉంది. సచిన్‌తోపాటు సునీల్ గవాస్కర్‌, దిలీప్ వెంగ్‌సర్కార్‌ పేర్ల మీద కూడా వాంఖడేలో స్టాండ్లు ఉన్నాయి.

వాంఖడేలో తన విగ్రహం ఏర్పాటు చేయడంపై సచిన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. వాంఖడేతో తన అనుబంధం ఇప్పటిది కాదన్న సచిన్‌, తన తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడానని గుర్తు చేసుకున్నాడు. వాంఖడేకి వస్తే తన జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుందన్నాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు.

Tags

Read MoreRead Less
Next Story