T20 India: భారత్‌కు విండీస్‌ షాక్‌...

T20 India: భారత్‌కు విండీస్‌ షాక్‌...
నిర్ణయాత్మక మ్యాచ్‌లో కరేబియన్ల విజయం...ఏడేళ్ల తర్వాత విండీస్‌పై సిరీస్‌ కోల్పోయిన టీమిండియా...

టీ20 ఫార్మాట్‌లో వరుసగా 11 సిరీస్‌ విజయాలతో అప్రతిహాత్రంగా సాగుతున్న టీమిండియా జోరుకు వెస్టిండీస్‌(India vs West Indies‌) బ్రేక్‌ వేసింది. నిర్ణయాత్మక మ్యాచ్‌(fifth T20I )లో గెలిచి ఏడేళ్ల తర్వాత కరేబియన్ జట్టు భారత్‌పై సిరీస్‌ను దక్కించుకుంది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్‌ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి. అయిదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడి వెనకుంజ వేసిన హార్దిక్‌ సేన.. తర్వాతి రెండు టీ ట్వంటీలు గెలిచి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. అయితే సిరీస్‌ను తేల్చే కీలక మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన విండీస్‌... టైటిల్‌ ఎగరేసుకపోయింది. టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు టి20 సిరీస్‌ను మాత్రం కోల్పోయింది.


టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు విండీస్‌ బౌలర్లు షాక్‌ ఇచ్చారు. హోసీన్‌ వరుస ఓవర్లలో గత మ్యాచ్‌ హీరోలు యశస్వి, గిల్‌లను పెవీలియన్‌కు చేర్చాడు. అయిదు పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌, తొమ్మిది పరుగులు చేసిన శుభ్‌మన్‌ గిల్‌ మూడు ఓవర్లలోపే అవుట్‌ అయిపోయారు. ఈ దశలో సూర్యకుమార్‌కు జతయిన తిలక్‌ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. తిలక్‌ వర్మ (27; 18 బంతుల్లో 3×4, 2×6)తో భారత్‌ను భారీ స్కోరు దిశగా నడిపించాడు. కానీ కాసేపట్లోనే చేజ్‌ తిలక్‌వర్మను రిటర్న్‌ క్యాచ్‌తో అవుట్‌ చేశాడు. సంజూ సామ్సన్‌ కూడా నిరాశపరచగా, తనశైలి షాట్లతో సూర్యకుమార్‌ జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్‌ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసిన సూర్య(Suryakumar Yadav )...జట్టు స్కోరు 140 వద్ద నిష్క్రమించాడు. హార్దిక్‌ పాండ్య (14; 18 బంతుల్లో 1×6) నిలిచినా క్రీజులో ఇబ్బందిగా కదిలాడు. ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో పాండ్యా 7 పరుగులే చేశాడు. 11 నుంచి 16 ఓవర్ల మధ్య భారత్‌కు 37 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి భారత్‌ 165 పరుగులు చేసింది. చివరి నాలుగు ఓవర్లలో టీమ్‌ఇండియా అయిదు వికెట్లు చేజార్చుకుంది.


166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌.. బ్రెండన్‌ కింగ్‌(Brandon King ), పూరన్‌(Nicholas Pooran ) మెరుపులతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. బ్రెండన్‌ కింగ్‌ (85 నాటౌట్‌; 55 బంతుల్లో 5×4, 6×6), పూరన్‌ (47; 35 బంతుల్లో 1×4, 4×6) మెరవడంలో లక్ష్యాన్ని వెస్టిండీస్‌ 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా(eight-wicket win ) ఛేదించింది. వెస్టిండీస్‌ ఛేదనలో రెండో ఓవర్లోనే మేయర్స్‌ (10)ను అర్ష్‌దీప్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ సంబరడిపోయింది. కానీ కింగ్‌కు తోడైన పూరన్‌.. ఆ ఆనందాన్ని ఎంతోసేపు నిలవనివ్వలేదు. తనదైన శైలిలో ధనాధనా బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి విధ్వంసంతో విండీస్‌ ఏడు ఓవర్లలో 71/1తో బలమైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ సాధికారిక బ్యాటింగ్‌ను కొనసాగించడంతో ఆతిథ్య జట్టు సాఫీగా లక్ష్యం దిశగా సాగింది.


ప్రతికూల వాతావరణం కారణంగా 12.3 ఓవర్ల వద్ద ఆట నిలిచిపోయింది. అప్పటికి స్కోరు 117/1. 40 నిమిషాల విరామం తర్వాత ఆట తిరిగి ఆరంభమైంది. ఆ వెంటనే తిలక్‌ బౌలింగ్‌లో పూరన్‌ ఔటైనా విండీస్‌కు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. దూకుడు కొనసాగించిన కింగ్‌.. హోప్‌ (22 నాటౌట్‌)తో కలిసి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో విండీస్‌తో చివరి టీ20లో ఓడి సిరీస్‌ను 2-3తో భారత్‌ కోల్పోయింది. హార్దిక్‌ పాండ్య సారథ్యంలో భారత్‌ టీ20 సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. అతడి నేతృత్వంలో భారత్‌ ఇంతకుముందు నాలుగు సిరీస్‌లు గెలుచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story