Telangana Sheep Distribution scheme : గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణం..

Telangana Sheep Distribution scheme :  గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణం..
విస్తుపోయే నిజాలను బయటపెట్టిన కాగ్

తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ స్కామ్ పై చిత్ర విచిత్రాలను కాగ్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకల సిత్రాలు అన్నీఇన్నీ కావు. ఒకే బైకుపై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నాయని తెలుస్తోంది.అంతేకాదు అంబులెన్సుల్లో, కారు, బస్సుల్లోనూ గొర్రెలను తీసుకెళ్లినట్లు రికార్డులు ఉన్నాయని కాగ్ నివేదికలో పేర్కొంది. అలాగే జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపడంతో పాటు చనిపోయిన వారికీ గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపింది.

తెలంగాణలో గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని తీసుకువచ్చింది. 2017 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్‌గా అందజేశారు. ఒక యూనిట్‌ విలువ 1.25 లక్షల రూపాయలు కాగా అందులో 75 శాతం 93,750 రాయితీ ఇచ్చారు. 25 శాతం మేర 31250 లబ్ధిదారుడు చెల్లించాడు. ఈ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో రెండేళ్ల వ్యవధిలో 5వేల కోట్ల వ్యయంతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2021 డిసెంబరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3,385.32 కోట్ల రాయితీ వ్యయంతో 3.88 లక్షల మంది లబ్ధిదారులకు అంతే సంఖ్యలో గొర్రెల యూనిట్లను సరఫరా చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గొర్రెల పంపిణి పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని కాగ్ నివేధిక తేల్చింది. అసెంబ్లీలో గొర్రెల పంపిణీలోని అక్రమాలపై కాగ్ నివేధిక ప్రవేశపెట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

స్కీమ్ లో భాగంగా పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే సుమరు రూ.253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం అవుతుండగా నకిలీ రవాణా ఇన్వాయిస్ లతో రూ.68 కోట్లు స్వాహా అయ్యాయని కాగ్ రిపోర్టులో వెల్లడైంది.దాంతోపాటు గొర్రెలకు నకిలీ ట్యాగ్ లతో మరో 92 కోట్లు స్వాహా అయ్యాయని కాగ్ నివేదికలో వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story