KTR: పది సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని ఆటాడిస్తాం

KTR: పది సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని ఆటాడిస్తాం
బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా కేటీఆర్‌ ప్రచారం... కాంగ్రెస్‌-బీజేపీలపై విమర్శలు

పది సీట్లలో గెలిపిస్తే మరోసారి ఢిల్లీని ఆటాడించే రోజు వస్తుందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నిజాయతీకి కాంగ్రెస్‌ మోసం బీజేపీ ద్రోహానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కాసాని జ్ఞానేశ్వర్‌, RS ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా ప్రచారాలు నిర్వహించిన KTR...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటి...రాష్ట్రంలో పట్టు నిలుపుకునేందుకు భారత రాష్ట్ర సమితి కసరత్తు ముమ్మరం చేసింది. గులాబీ దళపతి KCR బస్సుయాత్రలు చేపట్టనుండగా...లోక్‌సభ అభ్యర్థులకు మద్దతుగా KTR ప్రచార జోరు పెంచారు.


చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. బుద్వేలు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్‌షోలో KTRతో పాటు భారాస MLAలు సబితారెడ్డి, ప్రకాశ్‌ గౌడ్‌, కాలె యాదయ్య తదితర నేతలు పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీని మోసం చేసిన వారికి, బలహీనవర్గాల నేత కాసానికి మధ్య చేవెళ్లలో పోరాటం జరుగుతుందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న ఆయన... మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని ఆరోపించారు. మతరాజకీయాలు చేస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పది మంది బీఆర్‌ఎస్‌ MP అభ్యర్థులు గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చేస్తామని KTR వ్యాఖ్యానించారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌కు మద్దతుగా అలంపూర్‌లో నిర్వహించిన నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ మీద వంద రోజుల్లోనే నమ్మకం పోయిందని విమర్శించారు. ఆదాయం రెట్టింపు చేస్తామని హామి ఇచ్చిన భాజపా...కష్టాలు రెట్టింపు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రానికి మోదీ ఏం చేశారో చెప్పకుండా జైశ్రీరామ్‌ అంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో కొట్లాడేందుకు బీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

‘‘బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌. ఆ వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొదటిసారి బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మోదీ, ఎన్డీయే కూటమికి 400 కాదు..200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిలదీయాలి. రైతుల దగ్గరకు వెళ్లి రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేరిందా అని అడగాలి. కేసీఆర్‌ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు.. కాంగ్రెస్‌ 100 రోజుల అబద్ధాల పాలన మరో వైపు. భాజపా పదేళ్లలో ఏం చేసిందో చెప్పి ఓటు అడగమంటే చెప్పేందుకు ఒక్కటీ లేదు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story