KTR: ఆషామాషీగా తీసుకోవద్దు

KTR: ఆషామాషీగా తీసుకోవద్దు
బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం... సరికొత్తగా ప్రచారం చేయాలని సూచన

ఎన్నికల ప్రచారాన్ని ఆషామాషీగా తీసుకోకుండా సీరియస్‌గా, వ్యూహాత్మకంగా పని చేయాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో, తొమ్మిదేళ్ల పాలన ఫలాలు ఇంటింటికీ ప్రచారం చేసి ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR దిశానిర్దేశం చేశారు. తటస్థ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రచారంలో మూస పద్ధతులు వీడి.. సామాజిక మాధ్యమాల్లో సరికొత్తగా ప్రచారం చేయాలని చెప్పారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్‌ నేతలకు పిలుపునిచ్చారు.


ప్రచారవ్యూహాల కోసం ఏర్పాటు చేసిన 119 నియోజకవర్గాల వార్ రూమ్‌ల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో, తొమ్మిదేళ్ల అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని KTR చెప్పారు. ప్రచారంలో సంప్రదాయ పద్ధతులతో పాటు.. వినూత్న విధానాలు అవలంబించాలన్నారు. ఎక్స్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలని కేటీఆర్ తెలిపారు. సీనియర్ నేతలు సాంకేతిక వినియోగంలో కొంత వెనకబడి ఉన్నారని.. వారు సైతం కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు, ఇంఛార్జీలందరూ వ్యక్తిగతంగా సోషల్ మీడియా అకౌంట్లు తెరవాలన్నారు.

కొత్త ఓటర్లకు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ప్రభావితం చేయడం సాధ్యమవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి వచ్చే సూచనలను వెంటనే అమలు చేయాలన్నారు. ఓటర్లను మూడు కేటగిరీలుగా విభజించి.. తటస్థ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పనితీరు వివరించి ఓటు అడగాలని కేటీఆర్ తెలిపారు. వంద మందికి ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల మూడ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సెంట్రల్ వార్ రూమ్‌కు చేరవేయాలని.. అక్కడి నుంచి వచ్చే వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. KCR మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలని భారాస వార్ రూం ఇంచార్జీలకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. భారాస మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయని.. నెలరోజులు కష్టపడి సీరియస్‌గా పనిచేయాలన్నారు. మేనిఫెస్టోను బలంగా తీసుకెళ్లడంలో కొంత వెనకబడుతున్నామని వేగం పెంచాలన్నారు. ఎన్నికల హామీలు, తొమ్మిదిన్నరేళ్ల పాలనను మీడియా, సామాజిక మాధ్యమాలు, ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించాలని హరీశ్‌రావు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story