CAG: రెవెన్యూ మిగులులో తెలంగాణ విఫలం

CAG: రెవెన్యూ మిగులులో తెలంగాణ విఫలం
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని అధిగమిస్తోందన్న కాగ్..... విద్య, వైద్యానికి ఖర్చు తక్కువగా ఉంటోందని ఆక్షేపణ

రెవెన్యూ మిగులును సాధించడంలో తెలంగాణ వరుసగా విఫలం అవుతోందని.. బడ్జెట్ వెలుపలి అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే రుణపరిమితి FRBMను అధిగమిస్తోందని కాగ్ స్పష్టం చేసింది. రెవెన్యూ రాబడి ఎక్కువగా, లోటు తక్కువగా చూపి.. ఇచ్చిన రుణాల రూపంలోని ఆస్తులను ఎక్కువగా చేసి చూపినట్టైందని వ్యాఖ్యానించింది. విద్య, వైద్యానికి చేసిన ఖర్చు తక్కువగానే ఉంటోందని... సంక్షేమ పథకాల కేటాయింపులతో పోలిస్తే వ్యయం తక్కువగా నమోదు అవుతోందని కాగ్ పేర్కొంది. విభజన పంపకాల విషయంలో తగినంత దృష్టి కేంద్రీకరించడం లేదని తెలిపింది.


2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ - కాగ్ నివేదిక ఇచ్చింది. 2021-22లో తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి అధిక వృద్ది రేటు నమోదు చేసిందని కాగ్ పేర్కొంది. 26శాతం మేర రెవెన్యూ రాబడి పెరిగినా రెవెన్యూ మిగులును సాధించడంలో.. రాష్ట్రం వరసగా మూడో ఏడాది విఫలమైందని పేర్కొంది. ద్రవ్యలోటు.. రుణ బాధ్యతల లక్ష్యాలను సాధించలేకపోయిందని... వివిధ కారణాల దృష్ట్యా రెవెన్యూ.. 11వందల 57కోట్ల మేర తక్కువ చేసి చూపిందని తెలిపింది. వడ్డీ చెల్లింపు బాధ్యతలు నేరవేర్చకపోవడం వల్ల ద్రవ్యలోటును కూడా ...182కోట్ల మేర తక్కువగా చూపినట్లు పేర్కొంది.


తెలంగాణ బడ్జెట్ నుంచి చెల్లిస్తున్న... బడ్జెట్ వెలుపలి అప్పులు, ఇతర చెల్లింపు బాధ్యతలను కూడా పరిగణలోని తీసుకుంటే GSDPలో అప్పుల నిష్పత్తి 37.77శాతంగా ఉంటుందని.. ఇది చట్టప్రకారం నిర్దేశించిన 25శాతం కంటే ఎక్కువగా ఉంటుందని కాగ్ తెలిపింది. 15వ ఆర్థికసంఘం నిర్దేశించిన 29.30శాతం కన్నా కూడా.. ఎక్కువగా ఉందని చెప్పింది. రెవెన్యూ రాబడి ఎక్కువ .. లోటును తక్కువ చూపి.. ఇచ్చిన రుణాల రూపంలోని ఆస్తులను ఎక్కువగా చేసి చూపినట్లైందని కాగ్ వ్యాఖ్యానించింది.

మొత్తం వ్యయంలో తప్పనిసరి ఖర్చుల వాటా పెరిగిందని.. విద్యా-ఆరోగ్యం మీద ఖర్చు విషయంలో రాష్ట్రం వెనుకంజలోనే ఉందని కాగ్ తెలిపింది. మొత్తం వ్యయంలో విద్య మీద 8శాతం ఖర్చు కాగా.... ఆరోగ్యం మీద 4శాతమే ఖర్చయిందని పేర్కొంది. రాష్ట్ర వనరుల నుంచి అప్పులకు సంబంధించి చెల్లిస్తున్న లక్షా 18వేల 955కోట్ల మేర బడ్జెట్.. వెలుపలి రుణాలను ప్రభుత్వం వెల్లడించలేదని GSDP, అప్పుల నిష్పత్తిపై ఈ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించింది. రెవెన్యూ లోటు నమోదు చేసినందున.. ఆ లోటును మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల ద్వారానే భర్తీ చేయాల్సి వస్తుందని తెలిపింది. రుణాల మీద వడ్డీ, అసలు కోసం 2032-33నాటికి రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల 48కోట్లను తీసుకోవాల్సి వస్తుందని.... ఇది ప్రభుత్వ ఆర్థికాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. 2018-19 తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఆస్తులు అప్పుల పంపకం పురోగతి లేదని, ఇది విభజన పంపకాల విషయంలో తగినంత దృష్టిలేదని చూపిస్తున్నట్లు కాగ్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story