TS: సమగ్ర కుల గణనకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర

TS: సమగ్ర కుల గణనకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదముద్ర
అన్ని వర్గాల అభ్యన్నతి కోసమే అన్న సీఎం రేవంత్‌రెడ్డి... చట్టబద్దత కల్పించాలన్న కేటీఆర్‌

తెలంగాణలో సమగ్ర కుల గణన సర్వే చేయాలని శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. కుల గణన కోసం ఇంటింటి కుటుంబ సర్వే చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యన్నతి, ప్రణాళికల కోసం సర్వే చేయనున్నట్లు తీర్మానంలో వెల్లడించారు. బలహీన వర్గాలను బలోపేతం చేసి... పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించిన కేటీఆర్...చట్టం లేదా కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. కుల గణన కోసం చట్టం అవసరం లేదని.. చిత్తశుద్ధి చాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


కుల గణన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. కుల గణనపై తీర్మానం ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్...రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన ప్రణాళికల కోసం ఈ సర్వే చేయనున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. బలహీన వర్గాలను బలోపేతం చేసి.. పాలితులుగా ఉన్న వారిని పాలకులుగా చేయడమే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన నిధులను కేటాయించి బలహీన వర్గాలను ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టకుండా.. రహస్యంగా దాచి పెట్టి ఎన్నికలప్పుడు రాజకీయంగా వాడుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు.


కుల గణన తీర్మానం దేశచరిత్రలోనే చరిత్రాత్మకమని... న్యాయపరమైన చిక్కులు రాకుండా విధివిధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. న్యాయనిపుణులు, మేధావుల సూచనలు స్వీకరించి మార్గదర్శకాలు తయారు చేస్తామన్నారు. సర్వేలో అన్ని కులాలతో పాటు ముస్లింలు, ఇతర మైనార్టీల స్థితిగతులను కూడా సేకరించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. కుల గణన తర్వాత బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎవరూ ఊహించని విధంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు.


కుల గణనను స్వాగతించిన బీఆర్‌ఎస్‌...చట్ట బద్ధత కల్పించాలని సూచించింది. ప్రభుత్వ ప్రయత్నం ఫలించాలంటే చట్టం చేయాలని లేదా జ్యుడీషియల్ కమిషన్ ద్వారా చేయాలని కేటీఆర్ సూచించారు. కుల గణనకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎవరి ద్వారా, ఏయే అంశాలపై చేస్తారో స్పష్టంగా వివరించాలని కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ కోరారు. కుల గణన ఎలా చేయాలనే అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. కమిషన్ ద్వారా కుల సర్వే చేయాలన్నారు. ఎన్నికల సమయంలోనే బీసీల ప్రయోజనాలు చర్చకు వస్తాయని .. మేమెంతో మాకంత అని బీసీలు అంటుంటే.... మీరెంత ఉన్నా మీకింతే అనే ధోరణిలో ప్రభుత్వాలు, పార్టీలు అనుసరిస్తున్నాయన్నారు. ముస్లింల స్థితిగతులపై కూడా సర్వే చేయాలని ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. సర్వేలో తేలిన అంశాలపై చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా కులగణన చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story