Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్..

Charminar Express: పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్..
డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టి..

Charminar Express నాంపల్లిలో చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకొనే క్రమంలో పట్టాలు తప్పింది. ఒక్కసారిగా కుదుపుకు గురై ప్లాట్‌ఫాం సైడ్‌ గోడలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. కొంతమందికి గుండెపోటు రావడంతో లాలాగూడ రైల్వే ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కేకలువేస్తూ ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు. నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో డెడ్ ఎండ్ లైన్ చూసుకోకుండా లోకో పైలట్ వెళ్లినట్లు సమాచారం. దీంతో డెడ్ ఎండ్ లైన్ ప్రహరికి చార్మినార్ ఎక్స్ ప్రెస్ తాకింది. ఈ ప్రమాదంలో ఎస్ -1, ఎస్-2, ఎస్-3 మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం ఘటనపై హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.స్టేషన్ ప్లాట్ ఫాంపై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇంజన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story