REVANTH: ప్రధాని మోఢీతో రేవంత్‌రెడ్డి భేటీ

REVANTH: ప్రధాని మోఢీతో రేవంత్‌రెడ్డి భేటీ
గంటసేపు సాగిన చర్చలు... పెండింగ్‌ అంశాలు, విభజన చట్టంలోని అంశాలపై ప్రధానికి వినతిపత్రం

ప్రధాని నరేంద్ర మోఢీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో దాదాపు గంట సేపు చర్చలు జరిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం..కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ అంశాలు, విభజన చట్టంలో అంశాలపై వినతిపత్రం అందించారు. విభజనచట్టంలో పేర్కొన్న మేరకు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న ఐటీఐఆర్‌ ప్రాజెక్టును తక్షణం మంజూరు చేయాలని కోరారు. తెలంగాణకు..ఐఐఎం, సైనిక్‌ స్కూల్‌ కూడా మంజూరు చేయాలనివిజ్ఞప్తి చేశారు.


ములుగులోని గిరిజ‌న విశ్వవిద్యాల‌యం ఏర్పాటుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్‌రెడ్డి, భట్టి 2023-24 విద్యా సంవ‌త్సరానికి ప్రవేశాల‌కు అనుమ‌తి ఇవ్వాలని కోరారు. పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో... వ‌రంగ‌ల్‌ కాక‌తీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించినందున దానికి రావ‌ల్సిన‌న్ని నిధులు రాలేదని.., వెంట‌నే దాన్ని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేసేలా కేంద్ర ఆర్థికశాఖకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి సడలింపుపై అడగలేదని ప్రధానితో భేటీ తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి వివరించామన్నారు. ఒక రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయాన్ని చేస్తామని ప్రధాని తమతో చెప్పినట్లు భట్టి వివరించారు ప్రతిశాఖాపరంగా కేంద్ర నుంచి పెండింగ్‌ నిధులపై నివేదిక ఇచ్చామని....... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.


తెలంగాణలో 14 ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్రతిపాదిస్తే రెండింటికే ఆమోదం తెలిపారని, మిగిలిన 12 ర‌హ‌దారుల అప్‌గ్రేడ్‌ చేయాలని... ప్రధానిని కోరినట్టు సీఎం వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడిగిన అంశాలను వినతిపత్రం రూపంలో లిఖితపూర్వకంగా అందజేశారు. అనంతరం తెలంగాణభవన్‌లో రేవంత్‌రెడ్డి సమక్షంలో భట్టి విక్రమార్క.. ప్రధానితో జరిగిన చర్చ సారాంశాన్ని విలేకరులకు వివరించారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రధాని నరేంద్రమోదీని తొలిసారి కలిసినట్లు వెల్లడించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన అనేక పెండింగ్‌ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని... మేం కోరి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని.. వీటికి సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హక్కులను సాధించుకోవడంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా తాత్సారం చేసిందన్నారు. దయచేసి ఇప్పుడైనా ఆ అంశాలను త్వరితగతిన తెలంగాణకు అందించాలని ప్రధానిని కోరినట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story