TS: నీటిపారుదలశాఖపై రేవంత్‌రెడ్డి సమీక్ష

TS: నీటిపారుదలశాఖపై రేవంత్‌రెడ్డి సమీక్ష
బ్యారేజీల పటిష్టతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం... అధికారుల తీరుపై అసహనం

తెలంగాణ సచివాలయంలో సాగునీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పటిష్టతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆయన బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రెండు మూడు రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలన్న సీఎం తాను, నీటిపారుదల శాఖ మంత్రి కూడా పాల్గొంటామని చెప్పారు. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్లకు మరమ్మతులు చేయిస్తే సరిపోతుందా, పూర్తిగా లేదా పాక్షికంగా కూల్చి , కొత్తవి కట్టాలా అనే అంశాలపై కమిటీతో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామన్నారు.


కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు చేపట్టాలని, తాత్కాలికంగా హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోవాలన్నారు. గత పాలకుల తప్పులకు ఇప్పటికే తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం పేర్కొన్నారు. సుమారు లక్షన్నర కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు పది వేల కోట్ల వరకు ఖర్చయినా వెనకాడొద్దని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాజీ పడాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు కృష్ఱా జలాల్లో వాటాలు,ప్రాజెక్టులపై త్వరలో అఖిలపక్షభేటీ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కృష్ణాజలాలకు సంబంధించిన సమావేశాలు, KRMB ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు, అప్పుడేం చర్చలు జరిగాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత, అప్పుడు నిర్ణయాలు తీసుకున్నదెవరనే అంశాలను ప్రజలకు వివరిద్దామని అధికారులతో పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగే సలహాలు, సూచనలు తప్పకుండా ప్రభుత్వం స్వీకరిస్తుందని స్పష్టం చేశారు.నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్ని KRMBకి అప్పగించలేదన్న ఆయన ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే శాఖాపరంగా ఏం చేస్తున్నారని నీటిపారుదలశాఖ అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల్లోనే కృష్ణా బోర్డుతో సమావేశాలు ఎప్పుడు జరిగాయి, ఎవరు హాజరయ్యారు., ఏం నిర్ణయాలు తీసుకున్నారు, తమకు తెలియకుండా అధికారులేమైనా నిర్ణయాలు తీసుకున్నారా అని సీఎం అసహనం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story