CAG: కాళేశ్వరంలో లోపాలను ఎత్తిచూపిన కాగ్‌

CAG: కాళేశ్వరంలో లోపాలను ఎత్తిచూపిన కాగ్‌
రూపాయికి 52 పైసల లాభం కూడా లేదని కుండబద్దలు.... మూడో టీఎంసీ అదనపు భారమని స్పష్టీకరణ

కాళేశ్వరం ప్రాజెక్టుపై కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ - కాగ్ ఇచ్చిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. ప్రాణిహిత- చేవేళ్ల ప్రాజెక్టు సంబంధించిన అంశాలతో పాటు రీఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, నిధులు, ఒప్పందాలు, పనుల పురోగతి తదితరాలపై కాగ్ తన పరిశీలనలు పేర్కొంది. ప్రాణహిత - చేవేళ్ల తరహాలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా పనుల అప్పగింతలో నీటిపారుదలశాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని... కేంద్ర జలసంఘం డీపీఆర్‌ను ఆమోదించడానికి ముందే 25వేల49 కోట్ల విలువైన 17 పనులు అప్పగించిందని కాగ్ ఆక్షేపించింది.


డీపీఆర్ ఆమోదం పొందిన తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని... అవసరం లేకున్నా... మూడో టీఎంసీ పనులు చేపట్టడంతో 28వేల151కోట్ల అదనపు వ్యయం అవుతోందని పేర్కొంది. ప్రాజెక్టు పనుల్లో తదుపరి మార్పులతో పనుల విలువ భారీగా పెరిగిందని...ప్రాజెక్టు విలువ లక్షా 47వేల 427 కోట్లను మించిపోయే అవకాశం ఉందని కాగ్ పేర్కొంది. సాగునీటిపై అయ్యే మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6లక్షల 42 లక్షలుగా తేలుతోందని పేర్కొంది. సాగునీటికి కేటాయించిన 169 టీఎంసీల నీరు వానా కాలం పంటకు కూడా సరిపోక పోవచ్చని కాగ్ అభిప్రాయపడింది. వాస్తవానికి ప్రాజెక్టు ప్రయోజన - వ్యయ నిష్పత్తిని 1.51గా చూపారని, అయితే అది 0.52గానే తేలే అవకాశం ఉందని కాగ్‌ తెలిపింది. తద్వారా ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకం కాదన్న విషయాన్ని సూచిస్తోందని... నికరంగా చూస్తే ప్రాజెక్టుపై వెచ్చించే ప్రతి రూపాయికి కేవలం 52పైసల ప్రయోజనం మాత్రమే చేకూరుతుందని తెలిపింది. ఇది మరింత తగ్గే అవకాశముందని పేర్కొంది. ప్రాజెక్టులోని అన్ని పంపులు ఏకకాలంలో పనిచేస్తే...కాళేశ్వరం సహా రాష్ట్రంలోని పలు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అందించడం ప్రభుత్వానికి సవాల్‌ గా మారుతుందని హెచ్చరించింది.


కాళేశ్వరం ప్రాజెక్టు వార్షిక నిర్వాహణ కోసం 10వేల647 కోట్లు ఖర్చవుతుందని, ఇది ఎకరాకు 46,364రూపాయలుగా తేలుతోందని కాగ్ పేర్కొంది. ఈ మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తెలిపింది. 50 టీఎంసీల భారీ సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయానికి భూకంప సంబంధిత లోతైన అధ్యాయనాలు నిర్వహించకుండానే ముందుకు సాగారని కాగ్ ఆక్షేపించింది. ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చనున్నారన్న విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని పేర్కొంది. 2022 మార్చి నాటికి మొత్తం చేసిన 86వేల788కోట్ల ఖర్చులో 55వేల 807కోట్లను బడ్జెట్ వెలుపల రుణాల నుంచే ఖర్చు చేసినట్లు తెలిపింది.


కాళేశ్వరం కార్పోరేషన్‌కు ఎలాంటి ఆదాయ వనరులు లేనందున అప్పుల తిరిగి చెల్లింపు, వడ్డీ భారం... రాష్ట్ర బడ్జెట్ పైనే పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర అర్థిక వ్యవస్థపై దీర్ఘాకాలిక ప్రభావం చూపే అస్కారం ఉన్న భారీ ప్రాజెక్టు కోసం నిధులను ఎలా సమకూర్చుకోనున్నారో ఒక సమగ్ర ప్రణాళిక లోపించిందని కాగ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పెంచిన అంచనాలు... గుత్తేదారులకు అనుచిత లబ్ది విషయంలో ప్రస్తావించిన కేసులను సమీక్షించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు గుత్తేదారులకు చేసిన అదనపు చెల్లింపులను రాబట్టుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కాగ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story