TPCC: ముఖ్యమంత్రి రేవంతే!

TPCC: ముఖ్యమంత్రి రేవంతే!
నేడే సీఎల్పీ సమావేశం... కొలువుదీరనున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం

మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి అంటూ హస్తం పార్టీ చేసిన నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేశారు. మొత్తం 119 స్థానాలకు 64 సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. బీఆర్‌ఎస్‌ 39 సీట్లకే పరిమితమై డీలా పడింది. మెరుగ్గా సీట్లు పొంది కింగ్‌ మేకర్‌ కావాలనుకున్న బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితమైంది. సీపీఐ పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ,19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం, 8చోట్ల పోటీచేసిన జనసేన డిపాజిట్లు కోల్పోయాయి. ఈ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్‌ 65 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 13 చోట్ల మూడో స్థానంలోనూ, మలక్‌పేట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో నాలుగోస్థానంలో ఉంది. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ 26 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 25 చోట్ల మూడోస్థానానికి, మూడుచోట్ల నాలుగో స్థానానికి, బహదూర్‌పురలో అయిదో స్థానానికి పరిమితమైంది. 8 నియోజకవర్గాలను గెలుచుకున్న బీజేపీ 14 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన 97 సీట్లలో 3, 4, 5, ఆరో స్థానాల్లో ఉంది.


సీపీఐతో కలిసి 65 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. డిసెంబరు 9న ఎల్‌.బి.స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని పలు సందర్భాల్లో రేవంత్‌ ప్రకటించినప్పటికీ అంతవరకు ఆగకుండా ఇవాళే చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో మకాం వేసిన.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌ మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి గత రాత్రే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌ చేరుకోవడానికి ఆలస్యం కావడం వల్ల ఈ ఉదయం తొమ్మిదిన్నరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డీకే శివకుమార్, బోసురాజు, అజయ్‌ కుమార్, జార్జ్, దీపాదాస్‌ మున్షీ పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందజేస్తారు.


రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ బృందం మెజార్టీ సాధించినందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ఈ ఉదయం సీఎల్పీ భేటీలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని సమావేశం తర్వాత చెప్పిన శివకుమార్‌ తర్వాత కొత్త CM ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ ఇవాళ గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితా సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది ఇవాళ తేలనుంది. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story