Editorial: "వేములవాడ బీజేపీ టిక్కెట్ కోసం పోటాపోటీ- అదృష్టం ఎవరిది?"

Editorial: వేములవాడ బీజేపీ టిక్కెట్ కోసం పోటాపోటీ- అదృష్టం ఎవరిది?
వేములవాడ బీజేపీలో పొలిటికల్ హీట్; బరిలో నిలిచేందుకు ఆశావహుల పోటీ; నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న లీడర్లు; తమకే టిక్కెట్ అనే ధీమాలో నేతలు; అధిష్టానానికి ఇబ్బందిగా పరిస్థితి


రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ రాజకీయం హాట్ హాట్ గా నడుస్తోంది. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దిగేందుకు ఆశావహులు పెద్దసంఖ్యలో పోటీ పడుతున్నారు. మొదటగా చెప్పుకోవాల్సింది కేంద్ర మాజీమంత్రి విద్యాసాగర్ రావు కుమారుడు, ప్రతిమ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు గురించి. ఈయన రెండేళ్లుగా వేములవాడ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా సాధికారత లక్ష్యంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో ఉచిత వాటర్ ప్లాంట్లు, అంబులెన్సు సౌకర్యం కల్పిస్తూ అభిమానం పొందుతున్నారు. ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని టాక్. ఇందులో భాగంగానే గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నారట చెన్నమనేని వికాస్ రావు. తండ్రి ఇమేజ్ తో పాటు బీజేపీ ఓటు బ్యాంకు.. సేవా కార్యక్రమాలు కలిసివస్తాయని భావిస్తున్నారట.

వేములవాడ నుంచి బీజేపీ టిక్కెట్ ఆశిస్తున్న మరో లీడర్ ప్రతాప రామకృష్ణ. ఈయన రాజన్న సిరిసిల్లా జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటినుంచి వేములవాడకు నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈయన మూడుసార్లు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ బలపడుతున్న తరుణంలో మరోసారి అవకాశం ఇవ్వాలని రామకృష్ణ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో ఓడిపోవడంతో ఒక్క అవకాశం అంటూ నియెజకవర్గంలో తిరుగుతున్నారట. స్థానికంగానే ఉంటూ నియోజకవర్గ సమస్యలపై గళం విప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారట.

వేములవాడ టిక్కెట్ ఆశిస్తున్న మరోనేత తుల ఉమ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా చేసిన ఈమె.. అప్పట్లో అధికారపార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి విఫలమయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. వేములవాడ నియోజకవర్గంలోని కతలాపూర్, మేడిపల్లి మండలాల్లో పట్టున్న లీడర్ గా ఉన్నారు. బీజేపీ క్యాడర్ సైతం సీనియర్లకే అవకాశం ఇవ్వాలని కోరుతుండటంతో... తనకే అవకాశం దక్కుతుందనే ఆశలో ఉన్నారట తుల ఉమ.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం వేములవాడ నుంచే బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరిగినా... ఆయన ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారట. తన ఇలాఖా అయిన కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారట. ఏదేమైనా వేములవాడకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టుకోసం చేయని ప్రయత్నాల్లేవు. దీంతో ఎన్నికల నాటికి టిక్కెట్ ఎవర్ని వరిస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story