MEDIGADDA: మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే

MEDIGADDA: మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే
నిర్మాణం నుంచి నిర్వహణ వరకు లోపాలే.... నిర్మాణం ప్రారంభించిన నాలుగు నెలలకే లోపాలు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం నుంచి నిర్వహణ వరకు అడుగడుగునా లోపాలే ఉన్నట్లు విజిలెన్స్‌ విచారణలో తేలింది. యజమాని ప్రభుత్వం కాదు కాంట్రాక్టర్‌ అన్నట్లుగా ఇంజినీర్లు వ్యవహరించినట్లు గుర్తించారు. 2019లో బ్యారేజీని ప్రారంభించిన నాలుగు నెలలకే సమస్యలు తలెత్తాయి. అయిదేళ్లుగా నిర్వహణా సక్రమంగా లేదని బ్యారేజీ కుంగడంపై దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పేర్కొంది. ఈ మేరకు విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ ప్రాథమిక నివేదికను మంత్రి ఉత్తమ్‌కి అందించినట్లు తెలిసింది. బ్యారేజీ నిర్మాణం పూర్తై ప్రారంభించిన.... రెండేళ్ల తర్వాత అంచనా విలువ 13 వందల 53 కోట్లు పెంచడం సహా ఒప్పందాన్ని ఉల్లంఘించి కాంట్రాక్టర్‌ ఏది అడిగితే అది ఇచ్చారని గుర్తించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్‌ మొదలు, నాణ్యత, పర్యవేక్షణ, నిర్వహణ అన్నింటిలోనూ సమస్యలున్నట్లు నివేదికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపు, పెరిగిన ధరల వర్తింపు, నిర్మాణ గడువు పొడిగింపు ఇలా ఏ విషయంలోనూ... అధికారులు సరిగా వ్యవహరించలేదని గుర్తించారు.


బ్యారేజీ నిర్మాణ గడువు ఆరుసార్లు పొడగించడం సహా బ్యాంకు గ్యారంటీ తిరిగి ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తైన తర్వాత డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ రెండేళ్లు. ఆ తర్వాత మూడేళ్లపాటు నిర్వహణ గుత్తేదారే చేయాలి. ఐతే డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ఎప్పుడు మొదలైందో, నిర్వహణ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పని పూర్తైనట్లు మూడుసార్లు ధ్రువీకరణ పత్రాలిచ్చారని గుర్తించారు. ఓవైపు పని పూర్తైనట్లు ధ్రువపత్రం ఇస్తూనే.. ఇంకోవైపు ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని.., బ్యారేజీకి పలు చోట్ల నష్టం వాటిల్లిందని గుత్తేదారు సంస్థకు లేఖలు రాశారని విజిలెన్స్‌ బృందం గుర్తించింది. కానీ ఏజెన్సీ నుంచి తగిన స్పందన లేకున్నా... బిల్లులు ఎక్కడా ఆగకుండ చెల్లించేశారని పేర్కొంది. రికార్డులు ఇవ్వాలని విజిలెన్స్‌ ఇంజినీర్లకు లేఖరాస్తే వారు గుత్తేదారుకు లేఖ రాశారని తెలిపింది. ఒప్పందం ప్రకారం పనిపూర్తైన తర్వాత కాఫర్‌డ్యాంని... నిర్మాణ సంస్థ తొలగించాల్సి ఉన్నా ఆపని చేయలేదు. తద్వారా నష్టం జరిగింది. 2019లో నిర్మాణం పూర్తై బ్యారేజీని ప్రారంభించగా 2021 సెప్టెంబరు 6న నిర్మాణ వ్యయాన్ని 3 వేల 260 కోట్ల నుంచి 4 వేల 613 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో 330 జారీచేసిందని నివేదికలో విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.


పని పూర్తిస్థాయిలోకాకుండానే నీటిని నిల్వ చేయడంపై.. విజిలెన్స్‌ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఎవరెవరు బాధ్యులు, ఎవరిపై..... ఎలాంటి చర్య తీసుకోవాలో తుది నివేదికలో సిఫార్సు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఒప్పందం ప్రకారం పనులు జరిగాయా, నాణ్యత ఏంటి తదితర అంశాలను తెలుసుకొనేందుకు.... కోర్‌ కటింగ్‌చేయగా, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసేందుకు ఏజెన్సీ ప్రతినిధులు అంగీకరించలేదని విజిలెన్స్‌వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story