TS: కాళేశ్వరంపై సమగ్ర విచారణ చేస్తాం

TS: కాళేశ్వరంపై సమగ్ర విచారణ చేస్తాం
స్పష్టం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం... నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్ష..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. నీటి పంపకాలు, ఇతరత్రా ఏ సమస్య ఉన్నా పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్‌ కుంగడం చాలా తీవ్రమైన అంశమన్నారు. మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన ఏజెన్సీని, అధికారులను పర్యటనలో ఉండేలా చూడాలన్నారు.


నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ శాఖ ఉన్నతాధికారులతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిపై ఆరా తీశారు. ప్రాజెక్టుల గురించి మంత్రికి ENC మురళీధర్‌రావు వివరించారు. మేడిగడ్డను ఎవరు నిర్మించినా జరిగిన ఘటనకు బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల శాఖ చాలా కీలకమని.. పూర్తి వివరాలు రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు. తుమ్మడి హట్టి వద్ద ప్రాణహిత నది వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చేవారం నుంచి ప్రతి ప్రాజెక్టుపై విడివిడిగా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటిపారుదల శాఖ పారదర్శకంగా, అవినీతికి తావు లేకుండా సమర్థంగా పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తయ్యేందుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద నామమాత్రంగానే కొత్త ఆయకట్టు ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు వివరాలు చెప్పాలని అధికారులను అడిగినట్టు తెలిపారు. మరోవైపు.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఏవిధంగా నిర్మిస్తారని అధికారులను ప్రశ్నించారు. నిధులు ఎలా సమీకరించారని ప్రశ్నించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు థర్డ్ పార్టీ చెకింగ్ లేదా అని కూడా అధికారులను నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ అనుమతి ఉందా.. పాత ఆయకట్టును కూడా ఎందుకు కొత్త ఆయకట్టులో కలుపుతున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఉత్తమ్.

Tags

Read MoreRead Less
Next Story