Kavitha : లిక్కర్ కేసులో కవితనే అసలు సూత్రధారి : సీబీఐ ఆరోపణలు

Kavitha : లిక్కర్ కేసులో కవితనే అసలు సూత్రధారి  :  సీబీఐ ఆరోపణలు

లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక సూత్రధారి అని సీబీఐ పేర్కొంది. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అనెన్యూలోని ట్రయల్ కోర్టులో కవితను హాజరు పరిచారు సీబీఐ అధికారులు. విజయ్ నాయర్, మరికొందరితో కలిసి స్కెచ్ వేశారని వివరించారు సీబీఐ అధికారులు. ఢిల్లీ, హైదరాబాద్ లో సమావేశాలు జరిగాయన్నారు . ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన NOC పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు ఆమె సీఏ వాట్సాప్ చాటింగ్‌లో తేలిందని పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ లో ఈ స్కాం‌కి స్కెచ్ వేసినట్లు వెల్లడించింది. కవిత సౌత్ గ్రూప్ నుంచి రూ.100కోట్లు సమీకరించి.. ఆప్ నేతలకు ఇచ్చినట్లు ఆరోపించింది.

కవిత పీఏ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరుకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందినట్లు వివరించారు సీబీఐ అధికారులు. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33 శాతం వాటా ఉందన్నారు. ఇవన్నీ ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్ లో ఉన్నాయని, వీటి ఆధారాలు కూడా జతపరిచామన్నారు. శరత్ చంద్రా రెడ్డికి కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్ కి 5కోట్ల చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. శరత్ చంద్రారెడ్డి ఒప్పుకోకపోవడంతో అతడిని కవిత బెదిరించారన్నారు. జైల్లో విచారణకు కవిత సహకరించలేదని కోర్టుకు వివరించారు.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం కుదరదని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. సీబీఐ అధికారులు నిబంధనలు పాటించలేదన్నారు. అయితే చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని తెలిపారు సీబీఐ అధికారులు. అరెస్ట్ కు ఒక రోజు ముందే సమాచారం ఇచ్చామన్నారు. కవిత భర్తకు ఫోన్ లో సమాచారం తెలిపామన్నారు. రాత్రి పదిన్నర గంటలకు జైలు అధికారులు తనకు విషయం చెప్పారన్నారు కవిత. తన న్యాయవాదులతో మాట్లాడాలని చెప్పానన్నారు. తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిపారు. అయితే కవిత అరెస్ట్ అప్లికేషన్ సీబీఐ అధికారులు ఫైల్ చేయడంతో అనుమతిచ్చామన్నారు జడ్జి. అది తన పరిధిలో అంశమని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story