KCR: కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు

KCR: కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవద్దు
హస్తం నేతలవి గోల్‌మాల్‌ మాటలన్న KCR... రైతు బంధును వృథా అంటున్నారని ఆగ్రహం

కాంగ్రెస్ చెప్పే గోల్ మాల్ మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి KCR ప్రజలకు సూచించారు. ధరణి ఉండటం వల్లే ప్రభుత్వం వేసే రైతుబంధు డబ్బు రైతుల ఖాతాల్లో పడుతోందన్న ఆయన రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము వృథా చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని విమర్శించారు. ఎన్నికలప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి KCR అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట, పినపాక నియోజకవర్గం బూర్గంపాడు , నర్సంపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దళితుల బతుకులు మారలేదని KCR ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల బతుకులు మార్చేందుకే తమ ప్రభుత్వం దళితబంధు తెచ్చిందని గుర్తుచేశారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ గెలిస్తే పింఛన్లను దశల వారీగా 5వేలకు పెంచుతామని తెలిపారు. ఓటువేసే ముందు పార్టీల చరిత్రను ఒక్కసారి పరిశీలించాలని ప్రజలను కోరారు. ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థంలేదని పేర్కొన్నారు.


తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కోసమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పిన సీఎం ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నామని గుర్తుచేశారు. ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంట్‌ లేదన్న కేసీఆర్‌ తెలంగాణలో మాత్రమే ఇస్తున్నట్లు వివరించారు. రైతులు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లిచ్చామని చెప్పారు. ఎన్నికలు వస్తూ పోతుంటాయని.. ప్రజలు మాత్రం ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.


ప్రజలు అభ్యర్థుల మంచి, చెడుతో పాటు గుణం గురించి ఆలోచించాలని కేసీఆర్‌ సూచించారు. అభ్యర్థుల వెనక ఉన్న పార్టీల చరిత్ర.. వాటి నడవడిక, అధికారమిస్తే ఏం చేస్తారు? పేదలు, రైతుల పట్ల ఆ పార్టీల వైఖరి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అలా జరిగితే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలవడం ప్రారంభమవుతుందని, దాని ద్వారా మంచి జరిగే అవకాశముంటుందన్నారు. తెలంగాణలో మూడో సారి జరుగుతున్న ఎన్నికలివని... ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసన్నారు. తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపారన్న KCR... ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే అని విమర్శించారు. అప్పుడు ఉద్యమాలను అణచివేసింది ఎవరు? 2004లో రావాల్సిన తెలంగాణ ఆలస్యంగా వచ్చింది. తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి బీఆర్‌ఎస్‌ వచ్చినపుడు కరెంటు సమస్య ఉంది. నేడు దాన్ని పరిష్కరించుకున్నాం. కులం, మతం బేధాలు లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకెళ్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story