KCR : ఇవ్వాళ ఉ.10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

KCR : ఇవ్వాళ ఉ.10 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
KCR : ఇవ్వాళా ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారోనని అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

KCR : తెలంగాణలో అందరి చూపు అసెంబ్లీ వైపే. సమయాన్ని లెక్క పెట్టుకుంటూ టీవీలకేసి చూస్తున్నారు. ఇవ్వాళా ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారోనని అన్ని వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. నిరుద్యోగ యువత ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీపై సీఎం అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. అయితే ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. 75 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారా..? లేక లక్ష కొలువుల భర్తీ చేపడతారా..? జిల్లాల వారీగా ఉద్యోగాల ఖాళీలను కూడా ప్రకటిస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

బుధవారం ఉదయం 10 గంటలకు శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తానని వనపర్తి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో సీఎం ప్రకటన ఎలా ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాల భర్తీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై దాదాపు ఏడాదికాలంగా కసరత్తు చేసింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి సాంకేతికంగా ఇబ్బందులు సృష్టించే జోనల్ వివాదానికి కేంద్రం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది.

మరోవైపు శాఖల వారీగా ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. గతంలో చేసిన కసరత్తు ప్రకారం వివిధ శాఖల్లో 70 వేలకు పైగా ఖాళీలను గుర్తించారు. వీటిలో పోలీసు, విద్య, వైద్య శాఖల్లో భారీగా పోస్టులు ఉన్నాయి.

ఇక.. వేతన సవరణ సంఘం నివేదిక ప్రకారం తెలంగాణలో లక్షా 92 వేలా 800 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా పోస్టుల స్థానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో లక్ష ఉద్యోగాలు భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జిల్లాల వారీగా ఖాళీలపైనా సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కొత్త స్థానికత ఆధారంగా ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. వనపర్తి పర్యటన నుంచి వచ్చాక సీఎం కేసీఆర్ సైతం ఇందుకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు, అధికారులతో చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story