Mayday: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా మేడే

హైదరాబాద్ నారాయణగూడ నుంచి గోల్కొండ చౌరస్తా వరకు కార్మికులు భారీ ప్రదర్శన

తెలంగాణ వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో మే డేను నిర్వహించారు. పలు చోట్ల నేతలు జెండాలను ఆవిష్కరించి.. శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మికదినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని కార్మిక లోకానికి మాజీ ముఖ్యమంత్రి KCR శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రామికుల విజయ స్ఫూర్తిని చాటే రోజు.. మే డే... అని అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయన్న మంత్రులు......కార్మిక సొదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

"మే డే' ను... తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల ఐకాస హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన మేడే వేడుకల్ల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ హాజరై జెండా ఆవిష్కరించారు. మతోన్మాద శక్తులను ఓడించి కార్మిక వర్గం హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు. మే డే పురస్కరించుకొని హైదరాబాద్ నారాయణగూడ నుంచి గోల్కొండ చౌరస్తా వరకు... కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఎర్ర జెండాను ఆవిష్కరించారు. జహీరాబాద్‌లో సీపీఎం, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో చేపట్టిన భారీ ర్యాలీలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు. నడిగూడెంలో భవన నిర్మాణ కార్మికల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AITUC నడిగూడెం మండల అధ్యక్షుడు అఫ్జల్‌, ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story