TS: మేడిగడ్డలో అడుగడుగునా లోపాలు

TS: మేడిగడ్డలో అడుగడుగునా లోపాలు
ప్రభుత్వానికి ప్రాథమిక దర్యాప్తు నివేదిక.... అనేక మార్పులు జరిగాయన్న విజిలెన్స్‌

మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు సంబంధించి దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అడుగడుగునా లోపాలు ఎత్తిచూపింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ, అటు నీటిపారుదలశాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఆక్షేపించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వానికి ప్రాథమిక దర్యాప్తు నివేదిక సమర్పించింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని... భద్రతకు సంబంధించిన నిబంధనల గురించీ పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధరణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సూచించింది.


5 సీజన్లు పూర్తైనా కాఫర్ డ్యాం తొలగించలేదని కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య అనుసంధానం డ్రాయింగ్స్ ప్రకారం లేదని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్‌లోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని పేర్కొంది. త్రీడీ నమూనాకు అనుగుణంగా అప్ స్ట్రీం, డౌన్ స్ట్రీం భారాన్ని సరి చేయలేదని తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదన్న విజిలెన్స్... దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం 4సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 2020 మే.... 2021 ఫిబ్రవరి 2022 ఏప్రిల్ 2023 ఏప్రిల్‌లో నోటీసులు ఇచ్చి మరమ్మత్తులు చేయాలని కోరినప్పటికీ... నీటిపారుదలశాఖ, ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది. పనులు పూర్తి కాకముందే పూర్తైనట్లు ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌కు సంబంధించి ENC రామగుండం ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది.


బ్యారేజీ ఆపరేషన్‌లోకి తీసుకొచ్చే ముందు Ccబ్లాకులను ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ చేయకపోవటంతో పాటు కనీసం నిర్వహణ కూడా చేయలేదని... ఇది నిర్వహణాపరంగా చాలా ముఖ్యమైన అంశంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పేర్కొంది. 2019 నవంబర్‌లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని..... డ్యాం ఓనర్ల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది. నిర్ధిష్ట విధానం ప్రకారం నీటిపారుదలశాఖ పనులు చేపట్టలేదని... రాఫ్ట్, సీకెంట్ పైల్స్ నిర్ధిష్ట పద్ధతి ప్రకారం నిర్మించలేదని తెలిపింది. పైఅధికారుల నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులకు చాలా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ పేర్కొంది. 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభం అయినప్పటి నుంచి ఎలాంటి నిర్వహణ చేపట్టలేదని తెలిపింది. ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం.... గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్టలోని 6, 7, 8 బ్లాకులను 'L అండ్ T' కాకుండా ఉపగుత్తేదార్లు నిర్మించారన్న తీవ్రమైన ఆరోపణలున్నాయని, ఇందుకు సంబంధించి ఖాతాలు, చెల్లింపులు తదితర పూర్తి వివరాలు తీసుకుంటున్నట్లు విజిలెన్స్‌ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story