KTR: మూడోసారి సీఎం కేసీఆరే: కేటీఆర్‌

KTR: మూడోసారి సీఎం కేసీఆరే: కేటీఆర్‌
కాంగ్రెస్‌, బీజేపీకి అభ్యర్థులే లేరన్న కేటీఆర్‌.... చెరకు సుధాకర్‌ బీఆర్‌ఎస్‌లో చేరిక

తెలంగాణలో మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని మంత్రులు కేటీఆర్ , హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ నేత చెరకు సుధాకర్ ను బీఆర్‌ఎస్‌ చేరిన సందర్భంగా మంత్రులు ఇద్దరూ మాట్లాడారు. ఉద్యమకారుల చేరికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ , బీజీపీపై మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటక డబ్బుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో వచ్చిన 88 కంటే ఈ సారి ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి, బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడో ఇక్కడో MLAలపై చిరుకోపం ఉన్నా కేసీఆర్ నాయకత్వంపై ధృడమైన విశ్వాసం ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేసి 60 రోజులైందన్న కేటీఆర్‌ ప్రచారంలో ముందున్నామని, ఫలితాల్లోనూ ముందే ఉంటామని చెప్పారు.


కాంగ్రెస్ కు 40 చోట్ల అభ్యర్థులు లేరని, బీజేపీ యుద్దానికి ముందే చేతులెత్తేసిందని కేటీఆర్‌ విమర్శించారు. బీజేపీ అభ్యర్థులు ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పదేళ్ల హయంలో APPSC ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు 24 వేలు మాత్రమేనన్న కేటీఆర్ అందులో తెలంగాణ వాటా పది వేలని వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో లక్షా 34వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని మిగిలిన 90 వేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.కాంగ్రెస్ తమకు ఏ మాత్రం పోటీ కాదని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో ఐదుగంటల కరెంట్ కోత వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు నేతలు నిండుగా ఉన్నా ఒక్క సీటు మాత్రమే వచ్చిందని కేటీఆర్ ఈ సారి కొందరు నేతలు వెళ్లినా సీట్లు పెరుగుతాయని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల కర్ణాటకలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందున కర్ణాటకలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో కనీసం ఐదు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడంలేదని... రైతులు ఆందోళన చేస్తున్న దృశ్యాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ కుటుంబంతో తెలంగాణకు నమ్మక ద్రోహ బంధమే ఉందని భారాస MLC కవిత పేర్కొన్నారు. మూడ్రోజుల బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ అంటూ రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న కవిత ఆయన వెంట ఉన్న వారిలో దొరలున్నారా, దళితులున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ చెప్పే కులగణన తెలంగాణలో పదేళ్ల కిందే పూర్తైందని గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story