TS: కాంగ్రెస్‌లో చేరికల జోరు

TS: కాంగ్రెస్‌లో చేరికల జోరు
గాంధీభవన్‌ బాట పడుతున్న ప్రతిపక్ష నేతలు.... వీలైనన్నీ ఎంపీ సీట్లు దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ కసరత్తు

తెలంగాణలో అధికారపగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం మొదలవుతోంది. చేరికలను ఆహ్వానించాలని హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించటంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా గాంధీభవన్‌ బాట పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని సీట్లను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌ తెలంగాణ నాయకత్వం బలమైన నేతలను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వరకు వరుసగా చేరికలుంటాయని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. వ్యవస్థల పునఃనిర్మాణం పేరుతో పాలనాపరంగా చర్యలు చేపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అటు పార్టీపరంగా ఎత్తులకు పైఎత్తులేస్తూ, ప్రత్యర్థులను చిత్తుచేసేలా వ్యూహాలు పన్నుతోంది.


గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ నాయకత్వం.... ఆయా చోట్ల ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు అంతర్గతంగా మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ఎంపీని తమవైపు తిప్పుకోవటంతో చేరికలకు తెరదీస్తూ... వరుసగా కండువాలు కప్పుతున్నారు. తెలంగాణలోని మొత్తం 17లోక్‌సభ నియోజకవర్గాలకు 10చోట్ల మాత్రమే పార్టీకి చెందిన బలమైన నేతలు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. మిగిలిన 7స్థానాల్లోనూ సత్తాచాటాలంటే అందుకు తగిన గెలుపుగుర్రాలను ఎంపిక చేయాలని భావిస్తున్న హస్తం పార్టీ... ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు అవసరమని అంచనా వేస్తోంది. అత్యంత బలహీనంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో... పార్టీ బలోపేతానికి నడుం బిగించిన PCC... ఇతర పార్టీలకు చెందిన వారిని తమవైపు తిప్పుకునేందుకు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్‌లోఅసంతృప్తిగా ఉన్న GHMC మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన ఓ నేత... ఇతర పార్టీలకు చెందిన వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన దాదాపు 20మంది కార్పొరేటర్లు హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజల్లో బలం ఉన్న నాయకులతోనూ కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ కారు దిగి, కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల చేరికల విషయంలో మాత్రం కాంగ్రెస్‌ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తోంది. దాదాపు 20మంది వరకు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి సైతం వెల్లడించటంతో చేరికల అంశానికి మరింత బలం చేకూరినట్టైంది.

మాజీ మంత్రి, MLC పట్నం మహేందర్‌రెడ్డి..... ఆయన సతీమణి, వికారాబాద్ ZP ఛైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి... తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, రోహిణ్‌రెడ్డితో కలిసి సీఎంను కలిసిన భారాస నేతలు.... చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై, అధిష్ఠానంతో చర్చించి... AICC ఆదేశాల మేరకు ముందుకెళ్లాని PCC అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story