Telangana Rains : తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు..

Telangana Rains : తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు..
Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి

Telangana Rains : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. రాష్ట్రంలోని అనేక చెరువులు నిండిపోయి మత్తడి పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి దగ్గర ఉద్ధృతి కొనసాగుతుంది.

ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 52 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలంలో లోతట్టు ప్రాంతాలైన అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్‌ నగర్‌ కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రాచలం నుంచి చర్ల వెళ్లే రాష్ట్ర రహదారి మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా వెళ్లే జాతీయ రహదారి వరద నీరు చేరడంతో బ్లాక్ అయింది. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్‌, కొత్తగూడెం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు.

భద్రాద్రి

గోదావరి వరదలతో రెండ్రోజులుగా భద్రాచలంలోనే ఉన్న మంత్రి పువ్వాడ అజయ్‌... సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను అలర్ట్‌ చేశారు. గోదావరి వంతెన, కరకట్ట నదీ ప్రవాహాన్ని పరీశిలించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజల పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి పువ్వాడ అజయ్‌.

ములుగు

ములుగు జిల్లాలో భారీ వర్షాలతో.. లోతట్టు ప్రాంతాలుజలమయం అయ్యాయి. ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర్‌ఘాట్‌ వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక చేశారు. రామన్నగూడెం, రాంనగర్‌ మధ్యలో అప్రోచ్‌ రోడ్డు తెగిపోవడంతో... రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే సీతక్క. తెగిపోయిన కరకట్టల వద్ద ఇసుక బస్తాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరకట్టలకు నిధులు మంజూరైనా... కాంట్రాక్టర్ల టెండర్లలో జాప్యమే ప్రస్తుత పరిస్థితి కారణమన్నారు.

వరంగల్

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్‌ తడిసి ముద్దైంది. నగరంలోని ఎస్సార్‌ నగర్‌లో నీరు చేరడంతో... కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లమీదకి నీరు రావడంతో.. స్థానికులు బయటికి రావాలంటే జంకుతున్నారు. చౌరస్తా నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌కి వెళ్లే రోడ్డుపై నీరు నిలవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వరంగల్ ఈస్ట్ నాగారం

వరంగల్‌లోని భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు మత్తడి పడుతున్నాయి. భద్రకాళి నిల్వసామర్థ్యం 15.6 అడుగులు కాగా.. ప్రస్తుతం అది పూర్తిగా నిండిపోయి కాపువాడవైపు అలుగుపోస్తోంది. దిగువనున్న కాలనీలు ముంపునకు గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రకాళి మత్తడి నీరు.. అలంకారు, పెద్దమోరీ, కాకతీ కాలనీ మీదుగా.. నాగారం చెరువులోకి వెళ్తున్నాయి.

ఉమ్మడి నల్లగొండ

భారీ వర్షాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ... ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో భారీ వర్షాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్‌. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరకుండా... అధికారులు చర్యలు చేపట్టాలి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. శిథిలావస్థ ఇళ్లలో ఉన్నవారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు.

అటు... ఐదురోజులుగా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పును ఊహించిన మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక.... గర్భిణీలను.. సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 131 మంది గర్బీణిలను గుర్తించి.. వారందరిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు తరలిస్తున్నారు. గర్బీణీలకు తోడుగా కుటుంబసభ్యుల్లో ఒకరు ఉండేలా భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

అటు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లెంకలగడ్డ గ్రామానికి ఓ గర్బిణీకి పురిటి నొప్పులు రావడంతో.. ఆమెను ఆసుపత్రికి తరలించాయి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలతో పెద్దంపేట వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడే సహాయక చర్యల్లో ఉన్న NDRFబృందాలు... గర్బీణిని... పెద్దంపేట వంతెన దాటించి... మహాదేవపూర్‌ ఆసుపత్రికి తరలించారు.

భారీ వరదలతో.. నిర్మల్‌ -మంచిర్యాల ప్రధాన రహదారిపై అప్రోచ్‌ రోడ్డు కోతకు గురైంది. ఈ ప్రాంతాన్ని పరిశీలించారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దారి మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు.

ఉమ్మడి మహబూబబ్ నగర్

ఉమ్మడి మహబాబునగర్‌ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుంటలు, చెరువులు నిండిపోయాయి. భారీ వర్షాలతో.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story