సెల్ ఫోన్ స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు

దర్యాప్తులో షాకింగ్ నిజాలు..

హైదరాబాద్‌లో సెల్‌ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు విక్రయిస్తున్న 17 మంది అంతర్జాతీయ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్లు కొట్టేసేందుకు ఈ గ్యాంగ్‌ ప్రత్యేకంగా కొందరు యువకుల్ని నియమించింది. ఐదేళ్లుగా ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ను నడిపిస్తూ వందలాది ఫోన్లను దొంగలించిన ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కోటీ 75 లక్షల రూపాయలు విలువగల 703 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో ఐదుగురు సుడాన్‌ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 26 కేసులున్నాయని గుర్తించారు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు మహ్మద్‌ ముజామిల్‌ అలియాస్‌ ముజ్జు, సయ్యద్‌ అబ్రార్‌... నగరంలోని పలు ప్రదేశాల్లో రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతాల్లో... ఒంటరిగా వెళ్తున్న వారి ఫోన్లు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇలా కొట్టేసిన ఫోన్లను నగరానికి చెందిన మహ్మద్‌ సలీమ్‌కు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వాటిని హైదరాబాద్‌లోని జగదీశ్‌ మార్కెట్లో విక్రయించేవారని వెల్లడించారు. వారందరినీ అదుపులోకి తీసుకొని విచారించగా అంతర్జాతీయ లింకుల గురించి బయటపడిందని అధికారులు పేర్కొన్నారు.

జగదీశ్‌ మార్కెట్లో సెల్‌ఫోన్‌ దుకాణం నిర్వహించే మహ్మద్‌ షఫీ అలియాస్‌ బబ్లూ దొంగిలించిన ఫోన్లను సుడాన్‌కు చెందిన కొందరు వ్యాపారస్తులకు అమ్మెవాడని విచారణలో తేలింది. ప్యాకింగ్‌ చేసిన ఆహారపదార్థాల మధ్య ఫోన్లను దాచి నౌకల ద్వారా సుడాన్‌కు తీసుకెళ్లేవారని పోలీసులు గుర్తించారు. ఖలీద్‌ అబ్దుల్‌బాగీ అనే వ్యాపారస్తుడు ఏడాదిలో కనీసం ఐదారు సార్లు కొట్టేసిన ఫోన్లను సుడాన్‌కు తీసుకెళ్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుడాన్‌లో భారత్‌లో తయారైన ఫోన్లకు మంచి డిమాండ్‌ ఉండడంతో... అక్కడ కొందరు రిసీవర్లు ఆర్డర్‌ పెడతారని తెలిసింది. దాని ప్రకారమే నిందితులు ఫోన్లు తీసుకెళ్లి విక్రయించి లాభం పొందుతున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

నిందితుల్లో ఒకరైన జగదీశ్‌ మార్కెట్లో సెల్‌ఫోన్‌ దుకాణం యజమాని... కేవలం చోరీ చేసిన ఐ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఎవరైనా ఐఫోన్‌ విడిభాగాలు కావాలని సంప్రదిస్తే.. కొట్టేసిన ఐఫోన్ల నుంచి తీసి తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొందరు అమెరికా సహా వివిధ దేశాల్లో ఐఫోన్లు కొనుగోలు చేసి... ఆ తర్వాత పోగొట్టుకున్నట్లు తప్పుడు క్లెయిమ్‌లు చేసేవారని పోలీసులు అన్నారు. ఆ తర్వాత ఫోన్లను భారత్‌కు తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు ఇటీవలే ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక ద్విచక్రవాహనం దొంగిలించి... అదే వాహనంపై నిర్మానుష్య ప్రాంతంలో ఒక వాచ్‌మెన్‌ గాయపరిచి సెల్‌ఫోన్‌ దొంగిలించారు. ఒక ఫోన్‌ కోసం వ్యక్తిని గాయపరిచేంత తెగించిన వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కారణంగా అంతర్జాతీయ సెల్‌ఫోన్‌ స్మగ్లింగ్‌ ముఠా లింకు బయటపడింది. ఈ గ్యాంగ్‌ సభ్యులు చైనా, బంగ్లాదేశ్‌ తదితర దేశాలకు కొట్టేసిన వాటిని అడ్డదారుల్లో పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story