TS: తెలంగాణలో రేపటి నుంచే ప్రజా పాలన

TS: తెలంగాణలో రేపటి నుంచే ప్రజా పాలన
సర్వం సిద్ధం చేసిన అధికారులు.... ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి నిర్వహించే 'ప్రజా పాలన'కు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంపై... మంత్రులు జిల్లాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను అందించడమే ప్రజాపాలన లక్ష్యమన్నారు. అహంకార పూరిత పాలనలో ధ్వంసమైన తెలంగాణను పునర్‌నిర్మిస్తామని మంత్రులు స్పష్టంచేశారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్‌ సర్కార్‌ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ప్రజా పాలనను చేపట్టింది. ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన ఇన్‌ఛార్జ్ మంత్రులు కార్యక్రమ అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీలకు రేషన్‌కార్డు ప్రామాణికం కాదని ప్రజా పాలన కార్యక్రమంలో ఆశావహుల డేటా సేకరిస్తామని మంత్రులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంకా పూర్తిస్థాయిలో విధి విధానాలు ఖరారు కాలేదన్నారు.


అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా ఉండేలా చేయడమే తమ లక్ష్యమని నల్గొండ జిల్లా సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దులగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. KTR శ్వేదపత్రం విడుదల చేశారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. త్వరలోనే తాము భారాస దోపిడీ పత్రం ఆవిష్కరిస్తామని స్పష్టంచేశారు. వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి... మంత్రులు సీతక్క, కొండా సురేఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలోనూ అవసరమైన మేర అధికారిక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.

ప్రజా పాలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు ముందే ప్రజలకు చేరేలా చూడాలని.. తద్వారా అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. కలెక్టరేట్‌లో అధికారులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story