TS: సార్వత్రిక సమ్మె విజయవంతం

TS: సార్వత్రిక సమ్మె విజయవంతం
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు ధర్నాలు, రాస్తారోకోలు.... నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన సార్వత్రిక సమ్మె దిగ్విజయంగా సాగింది. కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు, ధర్నాలు,రాస్తారోకోలతో ఆందోళన చేపట్టారు. కార్పొరేట్‌ శక్తులకు తలొగ్గి... ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని నినదించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి కార్మిక సంఘాల నేతలు కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా ప్రధాని మోదీ... కర్షకుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. వరంగల్‌లో పోచమ్మ మైదాన్ కూడలిలో కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు.



భద్రాద్రి జిల్లా ఇల్లందులో జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు పలువు న్యూడెమొక్రసీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మంలో కార్మిక సంఘాల నాయకులు బస్సు డిపో ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. అన్నదాతల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. మధిరలో ఆందోళనకారులు బ్యాంకులు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. భద్రాచలంలో అఖిలపక్షం నేతలు సార్వత్రిక సమ్మెలో పాల్గొని... కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ గడియారం కూడలిలో కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని డిమాండ్‌ చేశారు.


హుజూర్‌నగర్‌లో ఇందిరా సెంటర్‌ నుంచి గాంధీ పార్క్ వరకు అఖిలపక్ష నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రం స్పందించేంత వరకు పోరాడతామన్న ఆందోళనకారులు... వ్యవసాయ కూలీలకు 200 రోజుల పనిదినాలు కల్పించాలని కోరారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట A.I.T.U.C, సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్దపెట్టున నిరసనలతో హోరెత్తించారు. నిర్మల్‌ RDO కార్యాలయం ఎదుట వామపక్ష సంఘాలు ఆందోళన చేపట్టాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం 26వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట కేంద్ర వైఖరిని తప్పుపడుతూ కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కేంద్రం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నినదిస్తూ రాస్తారోకో చేపట్టారు. 22 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నినదించారు. మెట్‌పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. 25లక్షల ప్రమాద బీమా, ప్రభుత్వ పథకాల్లో ప్రత్యేక కోటా, ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరారు. హైదరాబాద్‌ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో కార్మికులకు కనీస వేతనం, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కార్మిక, రైతు సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story