RAHUL: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పెకిలిస్తాం: రాహుల్‌

RAHUL: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పెకిలిస్తాం: రాహుల్‌
ముగిసిన కాంగ్రెస్‌ తొలివిడత బస్సుయాత్ర... కేసీఆర్‌ ప్రభుత్వంపై రాహుల్‌ ఘాటు విమర్శలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా విజయభేరీ పేరుతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన తొలివిడత బస్సుయాత్ర మూడురోజులపాటు సాగింది. రామప్ప ఆలయం వద్ద ప్రారంభమైన యాత్ర ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్‌ నియోజకవర్గాల్లో కొనసాగింది. జగిత్యాలలో సమావేశం అనంతరం, కోరుట్లకు బయలుదేరిన రాహుల్.. అక్కడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. చివరిరోజు‍( శుక్రవారం) కరీంనగర్‌ నుంచి బయలుదేరిన రాహుల్‌ జగిత్యాలలో కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఒక కుటుంబం పాలైందని, తెలంగాణ ఆదాయం, భూములు, ఇసుక, మద్యం ఇలా పూర్తి సంపదంతా ఒక కుటుంబం నియంత్రణలో కొనసాగుతోందని రాహుల్‌ విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇక్కడి చక్కెర కర్మాగారాన్ని మళ్లీ తెరిపిస్తామని, తాము ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని రాహుల్‌ వెల్లడించారు.


అనంతరం కోరుట్ల మీదుగా నిజామాబాద్‌ జిల్లాలోకి ప్రవేశించిన రాహుల్.... మోర్తాడ్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. బీజేపీని ప్రశ్నించే విపక్ష నేతలందరినీ వెంటాడుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు..KCRను మాత్రం పట్టించుకోవని విమర్శించారు. బస్సు యాత్రలో చివరగా ఆర్మూర్‌ బహిరంగసభలో ప్రసంగించిన రాహుల్‌ ఇటీవల కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలను వివరించారు. ఆర్మూర్ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పాటిల్‌రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

గాండ్రిస్తున్న కాంగ్రెస్‌ పులులు బీఆర్‌ఎస్‌ను సర్కార్‌ను పెకిలించివేయనున్నట్లు చెప్పారు. మోర్తాడ్‌ వద్ద జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సోనియాగాంధీ ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఏర్పాటు చేయలేదన్న రాహుల్‌... కేసీఆర్‌ కుటుంబం చేసిన దోపిడినంతా ప్రజలకు పంచుతామని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరుగ్యారంటీలను వివరిస్తూ.... అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.చివరిరోజు కొండగట్టు, గంగాధరతోపాటు నిజామాబాద్ జిల్లాలోని మరిన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండగా.. దిల్లీలో రాహుల్‌ కార్యక్రమాల దృష్ట్యా.. షెడ్యూల్ లో మార్పులుచేశారు. ఈ కారణంగా ఆర్మూర్‌ సభనుంచి రోడ్డుమార్గంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి బయల్దేరి.. అక్కడి నుంచి రాహుల్‌ ఢిల్లీ వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story