Revanth Reddy: కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిసిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy:  కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిసిన రేవంత్‌రెడ్డి
రాహుల్ ట్వీట్, సోనియాతో ఫోటోలు

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి.. వరుసగా అగ్ర నేతలతో భేటీ అవుతున్నారు. ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీలతో ఆయన సమావేశమయ్యారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణస్వీకారానికి వారిని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో సుమారు 50 నిమిషాల పాటు రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, ప్రమాణ స్వీకారం తరువాత అమలు చేయాల్సిన పథకాలు, తదితర అంశాలపై రాహుల్ తో రేవంత్ చర్చించారు. ఈ సందర్భంగా రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌ నేతలతో చర్చించారు. గురువారం రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ తో భేటీ తరువాత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.రాహుల్ గాంధీ ట్వీట్ లో.. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి ప్రజా సర్కార్ ని నిర్మిస్తుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాహుల్ చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story