TS : 4 ఎంపీ స్థానాల్లో రేవంత్ మార్క్.. మరో నాలిగింటికి వీరే పోటీ!

TS : 4 ఎంపీ స్థానాల్లో రేవంత్ మార్క్.. మరో నాలిగింటికి వీరే పోటీ!

తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) మరోసారి తన పట్టు నిరూపించుకున్నారు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన 8 లోక్ సభ స్థానాలకుగాను 4 సెగ్మెంట్ లకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. పూర్తి జాబితాను ప్రకటిస్తారని ఆశించినా ఖమ్మం, హైదరాబాద్ , కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగ్ లో ఉంచారు. భువనగిరి, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

భువనగిరి టికెట్ కోసం కోమటిరెడ్డి కుటుంబం గట్టిగా పట్టుబట్టింది. ఓయూ విద్యార్ధి నాయకుడు పున్నా కైలాష్ నేతతోపాటు తీన్మార్ మల్లన్న ప్రయత్నించారు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఖరారు చేయాలని నిర్ణయించడంతో.. గత కొన్నాళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించారు. చామల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. మెదక్ ఎంపీ అభ్యర్థిగా మొదటి నుంచి పేరు వినిపించిన నీలం మధును ఖరారు చేశారు. ఈ టికెట్ కోసం సీనియర్ నేత జగ్గారెడ్డి కుటుంబం ప్రయత్నించింది. కానీ, సర్వే రిపోర్ట్ లన్నీ నీలం మధు వైపు ఉండటంతో ఆయన పేరును ప్రకటించారు.

ఆదిలాబాద్ లో మంత్రి సీతక్కకు సన్నిహితురాలు ఆత్రం సుగుణను అభ్యర్థిగా ఫిక్స్ చేశారు. నిజామాబాద్ కు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపించింది. దాంతో ఆయన పేరునే అధిష్టానం ఖరారు చేసింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో రేవంత్ మార్క్ స్పష్టమైందని పొలిటికల్ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న లిస్టులో ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్, మరో మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ లో ప్రవీణ్ రెడ్డి పేరును ఖరారు చేస్తారని భావించినా.. ఈ స్థానం కోసం రాజేంద్రరావుతోపాటు తీన్మార్ మల్లన్న సైతం పట్టుబడుతున్నట్లు సమాచారం. వరంగల్ టికెట్ ను సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కు ఖరారు అయిందని ప్రచారం జరిగినా.. ఈ స్థానం కోసం దొమ్మాటి సాంబయ్య, తాటికొండ రాజయ్య పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. మరో విడతలో ఈ నాలుగు స్థానాలపై స్పష్టత ఇస్తారని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story