REVANTH: నామినేటెడ్‌ పోస్టులపై రేవంత్‌రెడ్డి దృష్టి

REVANTH: నామినేటెడ్‌ పోస్టులపై రేవంత్‌రెడ్డి దృష్టి
MLC, ముఖ్య పదవుల ఎంపికకు కసరత్తు.... అసెంబ్లీ ముగిశాక ఢిల్లీకి రేవంత్‌!

మంత్రివర్గ విస్తరణతోపాటు MLC, ఇతర ముఖ్య పదవుల ఎంపికకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఆరుగురు మంత్రులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కౌన్సిల్ సభ్యులు, చీఫ్ విప్‌, విప్‌ల ఎన్నిక త్వరతగతిన పూర్తి చేయాలని భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తూ పాలనను గాడినపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కీలకమైన పోస్టుల్లో సమర్థవంతమైన అధికారులను నియమించుకునే దిశలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులోనూ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని నియామకాలు చేస్తున్నారు. సీఎం తన వ్యక్తిగత ముగ్గురు కార్యదర్శుల నియామకాల్లో గుమ్మి చక్రవర్తి రెడ్డి, శేషాద్రి.. బ్రాహ్మణ, షహన్వాజ్‌ ఖాసిమ్‌.. మైనార్టీ ఉండేట్లు చూసుకున్నారు.


పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో ఆరుగురికి స్థానం కల్పించాల్సి ఉంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి రెండు, BCలకు రెండు, STకి ఒకటి, SCకి లేక మైనారిటీలకు ఒకటి లెక్కన మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి.. ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు లభిస్తుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో ఎస్సీకి ఒకటి మైనారిటీలకు ఒకటి లెక్కన భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైనార్టీలకు చెందిన ఒక్క ఎమ్మెల్యే సైతం పోటీలో లేకపోవడంతో MLC ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల విషయంలో సర్దుబాటు కానట్లయితే రంగారెడ్డికి మంత్రి పదవి బదులు చీఫ్ విప్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిని సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, తెర వెనుక అన్నితానై నడిపిస్తున్న PCC సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. TSPSC ఛైర్మన్‌గా మాజీ IAS అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

MLC పదవుల కోసం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ను ముందుకు నడిపించడంలో ప్రోటోకాల్‌ ఛైర్మన్‌గా కీలక పాత్ర పోషిస్తున్న వేణుగోపాల్‌కు MLC లేదా.. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి గానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్‌ సీటు త్యాగం చేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌, మహిళ కోటా కింద MLC ఇవ్వాల్సి వస్తే.. అధికార ప్రతినిధి భవాని రెడ్డికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌కు ప్రభుత్వ సలహాదారుడు పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఆయన అనుభవాన్ని రాష్ట్ర పరిపాలనలో భాస్వామ్యం చెయ్యాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story