RESULT: ప్రముఖులకు తప్పని పరాభావం

RESULT: ప్రముఖులకు తప్పని పరాభావం
కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి... ఆరుగురు మంత్రులకు పరాజయం... ముగ్గురు బీజేపీ ఎంపీలకు చేదు ఫలితమే

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో అన్ని పార్టీల్లోని ప్రముఖులు ఖంగుతిన్నారు. విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఈసారి ప్రభావం చూపలేక ప్రాభవం కోల్పోయారు. గెలిచి మరోసారి శాసనసభలో అడుగుపెట్టాలన్న ఆశలు ఓటమితో ఆవిరైపోయాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లోని ప్రముఖులకు సైతం షాక్‌ తగలడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి KCR పోటీచేసిన కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మంత్రులుగా వ్యవహరించిన ఆరుగురు ప్రత్యర్థుల చేతిలో చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌ రెడ్డి చేతిలో 50 వేల 703 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు పాలకుర్తిలో 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి చేతిలో 47 వేల 634 ఓట్ల తేడాతో ఖంగుతిన్నారు. ఎర్రబెల్లి రాజకీయ అనుభవం అంత వయసు లేని యశస్విని ఏకంగా మంత్రిని ఓడించడం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. వనపర్తి నుంచి బరిలో దిగిన మరో మంత్రి నిరంజన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థి మేఘారెడ్డి 25 వేల 320 ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఖమ్మం బరిలో నిలిచిన మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఝలక్‌ ఇచ్చారు. 49 వేల 381 ఓట్ల తేడాతో తుమ్మల గెలిచారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో 18 వేల 738 తేడాతో చిత్తయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురి కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌రావు చేతిలో 22 వేల39ఓట్ల తేడాతో చేదు ఫలితం చవిచూశారు. 2018 ఎన్నికల్లో కేవలం 441 ఓట్లతో గట్టెక్కిన కొప్పుల ఈశ్వర్‌..ఈసారి మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. డోర్నకల్‌ స్థానంలో మాజీ మంత్రి రెడ్యానాయక్‌ను జాటోతు రామచంద్రనాయక్‌ 53 వేల 131 ఓట్ల తేడాతో మట్టికరిపించారు.


అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు సోయం బాపూరావు, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌కు పరాభవం ఎదురైంది. బోథ్‌ స్థానం నుంచి పోటీచేసిన ఎంపీ సోయం బాపూరావు బీఆర్‌ఎస్‌కు చెందిన అనిల్‌ జాదవ్‌ చేతిలో ఓటమి చవిచూశారు. కరీంనగర్‌ అసెంబ్లీ బరిలో దిగిన ఎంపీ బండి సంజయ్‌ సమీప ప్రత్యర్థి మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో కేవలం 3 వేల 163 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. కోరుట్ల స్థానం నుంచి ఎంపీ అర్వింద్‌ భారాస అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ చేతిలో ఖంగుతిన్నారు. హుజూరాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సమీప ప్రత్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో 16 వేల 873 ఓట్ల తేడాతో చేదు ఫలితాన్ని చవిచూశారు. దుబ్బాకలో కొత్తప్రభాకర్‌రెడ్డి చేతిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 53 వేల 513 ఓట్ల తేడాతో చేదు ఫలితాన్ని చవిచూశారు.


తెలంగాణ అంతా కాంగ్రెస్‌ గాలి వీచినా కొందరు ముఖ్య నాయకులకు ఓటమి తప్పలేదు. LB నగర్‌లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన మధుయాష్కీగౌడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి చేతిలో 22వేల305 ఓట్ల తేడాతో ఖంగుతిన్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు భారాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి చేతిలో 49 వేల350 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జగిత్యాలలో జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సంగారెడ్డిలో భారాస అభ్యర్థి చింతాప్రభాకర్‌... 8 వేల 217 ఓట్ల తేడాతో జగ్గారెడ్డిని మట్టికరిపించారు.

Tags

Read MoreRead Less
Next Story