HYD: ఒక్క స్విగ్గీలోనే 4లక్షల హలీమ్స్‌.. మిగతా వాటి లెక్కెంతో..!

HYD: ఒక్క స్విగ్గీలోనే 4లక్షల హలీమ్స్‌.. మిగతా వాటి లెక్కెంతో..!

రంజాన్‌ నెలలో హైదరాబాదీలు తమ అభిరుచికి తగ్గట్లుగా పండుగ చేసుకున్నారు. రెగ్యులర్‌గా తినే బిర్యానీల నుంచి పండుగ స్పెషల్‌ హలీమ్, స్వీట్లు భారీగా లాగించేశారు. కేవలం ఒక్క ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ ద్వారానే ఏకంగా పది లక్షల బిర్యానీలు, 4 లక్షల హలీమ్‌లు ఆర్డర్‌ చేసి తెప్పించుకున్నారు. అన్ని రకాల వంటకాలు కూడా గతేడాదితో పోలిస్తే ఈసారి 20శాతం ఎక్కువగా ఆర్డర్‌ చేసి తెప్పించుకుని తిన్నారు. స్విగ్గీ చేసిన ఓ సర్వే లో వెల్లడైన వివరాలను ఇవి. ఒక్క స్విగ్గీ యాప్‌ ద్వారానే ఇంత ఫుడ్‌ లాగించేస్తే.. మిగతా యాప్‌లు, నేరుగా హోటళ్లలో తిన్న బిర్యానీలు, హలీమ్‌లు లెక్క ఇంకెంత పెద్దగా ఉంటుందో అర్థమవుతోందని భాగ్య నగరవాసులు అంటున్నారు.

ఇక రంజాన్‌ మాసంలో ఎప్పటిలాగే హలీమ్‌ కోసం ఆర్డర్లు వెల్లువెత్తాయి. తమ యాప్‌ ద్వారా 4 లక్షలకుపైగా హలీమ్‌లను ఆర్డర్‌ చేశారని స్విగ్గీ తెలిపింది. పండుగ స్పెషల్‌ హలీమ్‌ ఉన్నా బిర్యానీకి క్రేజ్‌ తగ్గలేదని పేర్కొంది. బిర్యానీ రాజధానిగా పేరును నిలబెట్టుకుంటూ తమ యాప్‌ ద్వారా 10 లక్షల బిర్యానీలను ఆర్డర్‌ చేశారని.. చికెన్, పాలమూరు పొట్టేల్, పర్షియన్‌ స్పెషల్, ఇరానీ, డ్రైఫ్రూట్‌ వంటి హలీమ్‌లు అమ్ముడయ్యాయని స్వీగ్గి తెలిపింది. వీటితో పాటుమల్పువా, ఫిర్నీ,రబ్రీ వంటి మిఠాయి వంటకాలకూ డిమాండ్‌ పెరిగింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఖర్జూరంతో చేసిన ఇఫ్తార్‌ వంటకాలు, సమోసాలు, భాజియాలు ఉన్నాయని వివరించింది.

మరోవైపు హైదరాబాద్‌లో బిర్యానీ, హలీమ్‌ తదితర రుచులకు పేరొందిన ప్రముఖ రెస్టారెంట్లు పిస్తాహౌస్, ప్యారడైజ్, మెహఫిల్‌ తదితరాలకు భారీగా ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇక దాదాపు 5లక్షల వరకు డ్రైఫ్రూట్స్, ఖర్జూరాలకు సంబంధించిన ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది.

Next Story