CONGRESS: అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

CONGRESS: అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌
కొత్తగూడెం స్థానం సీపీఐకి కేటాయింపు.... నేడు కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నామినేషన్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎట్టికేలకు నాలుగువిడతల్లో 118 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. తొలిజాబితాలో 55, రెండులో 45, మూడులో16, నాలుగోవిడతలో ఐదుచొప్పున అభ్యర్థులను ప్రకటించింది. కొత్తగూడెంను సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. CPMతో కలిసి వెళ్లాలని భావించినా ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం రాకపోవడంతో పొత్తులులేకుండానే ముందుకెళ్తున్నాయి. నర్సాపూర్, మహేశ్వరం, బాన్సువాడ, నారాయఖేడ్‌కి చెందిన అసంతృప్తులను స్వయంగా కేసీవేణుగోపాల్ బుజ్జగించి పార్టీకి కలిసి పనిచేసేందుకు ఒప్పించారు. నేడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. ఆ సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హాజరుకానున్నారు.


బోధ్, వనపర్తి, పఠాన్‌చెరు స్థానాలకుకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మార్పుచేశారు. బోథ్‌లో వెన్నెల అశోక్ బదులు గజేందర్, వనపర్తిలో చిన్నారెడ్డికి రాజ్యసభ లేదా MLC ఇచ్చేలా నచ్చచెప్పి మేఘారెడ్డికి కేటాయించారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో హైదరాబాద్ వచ్చిన AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పీటముడి పడిన 4నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. పఠాన్‌చెరు స్థానానికి అభ్యర్థిని మార్చి నీలంమధుకి బదులు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ను ప్రకటించారు. మహేశ్వరం పారిజాతారెడ్డి, నర్సాపూర్ గాలిఅనిల్ కుమార్, బాన్సువాడ బాలరాజు, నారాయణఖేడ్‌కి చెందిన సంజీవరెడ్డిని పిలిపించుకొని స్వయంగా కేసీవేణుగోపాల్ మాట్లాడారు. అభ్యర్థులను మార్చేది ఉండదని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీఇవ్వగా వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అవినీతి పాలనకు కాంగ్రెస్ చరమగీతం పాడబోతోందని కేసీవేణుగోపాల్ జోష్యం చెప్పారు.

టీపీసీసీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొడంగల్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారు. కామారెడ్డిలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆనంతరం జరిగే బీసీడిక్లరేషన్ సభలో పాల్గొంటారు. అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే హామీలతో బీసీ డిక్లరేషన్‌ పెట్టినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ భావిస్తోంది. ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాని హస్తం శ్రేణులకు టీపీసీసీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story