TS ELECTION: మరింత ముమ్మరంగా ప్రచారం

TS ELECTION: మరింత ముమ్మరంగా ప్రచారం
జోరుగా సాగుతున్న నేతల ప్రచారం... ఊరూరును చుట్టేస్తున్న అభ్యర్థులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచార రథాలతో ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో వెళ్తున్న అన్ని రాజకీయపార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో వివరిస్తున్నారు. తమకే ఓటేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. సికింద్రాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని బేగంపేట డివిజన్ లోని పలు కాలనీలో పర్యటించిన మంత్రి బస్తీలలో పాదయాత్ర చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్‌ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఖైరతాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆనంద్‌ కుమార్‌ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్‌పేట్‌లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, గాజుల రామారం లోని బీజేపీ కార్యాలయం లో వడ్డెర సంఘం అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సతీమణి కమలా సుధీర్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.


ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయనకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్, జనసేన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ.. ములకలపల్లి మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు . జనసేన అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి అశ్వరావుపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారాస అభ్యర్థి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గంలోని ఈదుల చెరువులో అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులోమంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్‌ భారాస అభ్యర్థి శంకర్ నాయక్ తో కలిసి జిలేబీ వేస్తూ ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండలోని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం 60వ డివిజన్‌లో ప్రజా దీవెన యాత్ర పేరుతో కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలో భారాస అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story