TS: కృష్ణా జలాలపై అమీతుమీకి కాంగ్రెస్ సర్కార్‌ సిద్ధం

TS: కృష్ణా జలాలపై అమీతుమీకి కాంగ్రెస్ సర్కార్‌ సిద్ధం
బీఆర్‌ఎస్‌ పాలనలోనే తీవ్ర అన్యాయమన్న రేవంత్‌ సర్కార్.... ఇవాళ అసెంబ్లీలో వివరణ

కృష్ణా జలాలపై బీఆర్‌ఎస్‌తో అమీతుమీ తేల్చుకోడానికి కాంగ్రెస్‌ సర్కారు సిద్ధమైంది. సమైఖ్య రాష్ట్ర పాలనలో కన్నా బీఆర్‌ఎస్‌ హయాంలోనే తీవ్ర అన్యాయం జరిగినట్లు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఎమ్మెల్యేలకు తెలియపరిచింది. కృష్ణా జలాల నిర్ణయాల్లో జరిగిన అన్యాయాలను ఇవాళ అసెంబ్లీ సాక్షిగా వివరించునంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు CRPF బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా తెలంగాణ వాటా తేల్చేవరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ రెండు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. కృష్ణా జలాల విషయంలో బీఆర్‌ఎస్‌ హయాంలోనే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. హక్కులను కాలరాసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ముందుకు వెళుతోందని గులాబీ నేతలు శాసనసభలో ఆరోపిస్తున్నారు.


ఇవాళ పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్‌... బీఆర్‌ఎస్‌ విమర్శలు తిప్పికొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో కృష్ణా జలాల నిర్ణయాలపై MLAలు, MLCలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. CM రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, నేతలకు కృష్ణా జలాల వాడకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, అధికారులు వివరించారు. తెలంగాణ ఏర్పాటు నుంచి కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు కృష్ణా జలాలపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను MLAలు, MLCలకు సమగ్రంగా వివరించారు. నదీ పరివాహక ప్రాంతం, రెండు రాష్ట్రాలకున్న హక్కులు, వాటాలపై అవగాహన కల్పించారు. పదేళ్లలో రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలు...వివిధ సందర్భాల్లో నాటి CM KCR, ఏపీ CM జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్‌లను ప్రదర్శించారు. కృష్ణానదిపై తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులు, వాటి సామర్థ్యాలు, నీటి కేటాయింపులపై చర్చించినట్లు తెలుస్తోంది. AP ప్రభుత్వం వాడుకుంటున్న వాటా...ఒకవేళ అధికంగా నీటిని విడుదల చేసుకుంటే అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటనే అంశంలోనూ మాట్లాడినట్లు సమాచారం.


ఇరు రాష్ట్రాలకు కలిపి 811 TMCలుగా ఉన్న నీటిలో తెలంగాణకు 299 TMCలు మాత్రమే కేటాయించడం వల్ల జరిగిన అన్యాయం... దీనికి గత ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందనే అంశాలపై సైతం MLAలకు అవగాహన కల్పించారు. పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న MLAలు అసెంబ్లీలో భారాస విమర్శలను సమర్థంగా తిప్పి కొడతామని వెల్లడిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో... కృష్ణా జలాల విషయంలో నిర్ణయాలపై ఇవాళ శాసనసభ ద్వారా ప్రజలకు వివరించాలని నిశ్చయించుకున్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు CRPF బలగాల నుంచి విముక్తి కల్పించడం సహా రాష్ట్ర వాటా తేల్చేవరకు ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేది లేదంటూ రెండు తీర్మానాలను సభలో ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. సాగునీటి శాఖపై శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story