పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష

పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ సమీక్ష
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

పాలమూరు ఎత్తిపోతల నిర్మాణం పనులను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి ఎకరాన్ని కృష్ణా జలాలతో తడపాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో అనుసంధానించి నీరందించే ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరముందని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు, జిల్లాను ఆనుకుని వున్న తాండూరు, వికారాబాద్ ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా సాగునీటిని అందించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి మరింతగా విస్తరించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. ఆదివారం నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రారంభించిన సమీక్షా సమావేశం రెండోరోజు సోమవారం కూడా కొనసాగింది. ప్రగతి భవన్‌లో సాగిన సుధీర్ఘ సమీక్షా సమావేశంలో కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాల పనులను విస్తరించడం కోసం సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళికలను అనుసరించాల్సిన కార్యాచరణను ఇరిగేషన్ అధికారులకు పాలమూరు-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రతినిధులకు సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా వివరించారు.

ఇక కృష్ణా నదీ ప్రవాహం అక్టోబర్ నెల వరకే కొనసాగుతుందని, ఈ లోపు మనకు కేటాయించిన నీటి వాటాను వీలైనంతగా ఎత్తిపోసుకొని పాలమూరులో ఎండిన బీళ్లను తడుపుకోవాలన్నారు. ఇప్పటికే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఉందని, అందులో ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో దాని పరిధిలోని ఆయకట్టుకు నీరందడం కష్టమన్నారు. కల్వకుర్తి లిఫ్టు ఆయకట్టును పూర్తిస్థాయిలో స్థిరీకరించేందుకు పాలమూరు లిఫ్టు పనులను వేగవంతంగా కొనసాగించి, ఎక్కడికక్కడే అనుసంధానించుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇందులో భాగంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను నింపుకొని కొడంగల్, నారాయణ పేట్, పరిగి, తాండూర్, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల పరిధిలో సాగుభూములకు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశాలను సీఎం మ్యాపుల ద్వారా పరిశీలించి, అధికారులతో చర్చించారు.

Tags

Read MoreRead Less
Next Story