CM Revanth: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, డీఎస్సీపై నిర్ణయం

CM Revanth: విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, డీఎస్సీపై నిర్ణయం
మూసివేసిన అన్ని పాఠశాలలను తిరిగి తెరవండి, మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్

తెలంగాణ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దని స్పష్టం చేశారు. మారుమూల తండాలు.., కుగ్రామాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనన్నారు. చదువు కోసం ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి పిల్లలకు రావొద్దని చెప్పారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల కొరత తలెత్తకుండా మెగా DSC నిర్వహణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు.టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఆటంకాలను అధిగమించేందుకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని, అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. విద్యాసంస్థలకు వ్యాపార, పారిశ్రామిక కేటగిరి కింద విద్యుత్ బిల్లులు వసూలు చేయకుండా... ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలన్నారు. బడుల్లో స్వీపర్లు., పారిశుధ్య కార్మికుల నియామకానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 10 ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించిన నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని కొడంగల్‌లో ఏర్పాటు చేయాలని చెప్పారు. గుజరాత్, హరియాణా, రాజస్థాన్ఒ డిశా వంటి రాష్ట్రాలకు వెళ్లి స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్య, పరిశ్రమలు, కార్మిక శాఖల కార్యదర్శులతోన్ ప్రత్యేక కమిటీ వేసి, ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. పారిశ్రామిక నైపుణ్యంతోన్ ఉద్యోగాలను సాధించేలా.. స్కిల్ యూనివర్సిటీలు ఉండాలన్నారు. ఉపాధి ఆధారిత స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశ పెట్టాలని మార్గనిర్దేశం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఉచితంగా లాప్టా ప్‌లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.

మరోవైపు ప్రైవేటు యూనివర్సిటీలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రైవేటు వర్సిటీలు ఇష్టారాజ్యంగా నడిపించుకోవడం సరికాదన్నారు. ప్రైవేటు వర్శిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మౌలిక వసతులు, అర్హులైన సిబ్బంది లేకుండానే ప్రైవేటు యూనివర్సిటీలు ఎలా విద్యను అందిస్తున్నాయని ప్రశ్నించారు. వివాదాస్పద భూమలు, ఇంటి స్థలాల్లో వర్శిటీలకు అనుమతులు ఎలా ఇచ్చారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించడం వల్ల..చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్న ఆయన పథకం కింద జరిగిన పనులు ఖర్చు చేసిన నిధులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story