CONGRESS: సామాజిక వర్గాల వారీగా ఎవరెవరికీ ఎన్ని సీట్లంటే...

CONGRESS: సామాజిక వర్గాల వారీగా ఎవరెవరికీ ఎన్ని సీట్లంటే...
తెలంగాణ కాంగ్రెస్‌ మొదటి జాబితా విడుదల... కొత్తగా చేరిన 13మందికి సీట్లు...

తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణలో ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల మొదటి జాబితా విడుదలయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ 55 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 55 నియోజక వర్గాలల్లో సామాజిక వర్గాల వారీగా తీసుకుంటే.. రెడ్లకు, బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించి పెద్దపీట వేసింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తవారికి 13 మందికి ఈ మొదటి జాబితాలో టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోపాటు వివాదరహితమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఎంఐఎంకు గట్టి పట్టున్న హైదరాబాద్‌ పాతబస్తీ పరిధిలో 7 స్థానాలకు కాంగ్రెస్‌ టికెట్లు ప్రకటించింది.


మొత్తం 119 నియోజక వర్గాలకు 55 టికెట్లు ప్రకటించగా.. ఇంకా టికెట్లు ప్రకటించాల్సిన స్థానాలు 64 ఉండడంతో.. బీసీలకు అందులో కూడా పెద్దపీట వేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు మరో 12 నుంచి 15 టికెట్లు వరకు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కామారెడ్డి బదులు ఎల్లారెడ్డి టికెట్‌ కావాలని షబీర్‌ అలీ పట్టుబట్టడంతో అక్కడ టికెట్‌ ప్రకటన పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం టికెట్‌ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. అక్కడ ప్రకటించాల్సిన టికెట్లు కూడా అర్ధాంతరంగా ఆగినట్లు సమాచారం.


నేటి మొదటి జాబితాలోని 55 పేర్లను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్లకు అత్యధికంగా 17 నియోజక వర్గాలల్లో టికెట్లు దక్కాయి. బీసీలకు 12, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2, వెలమ 7, బ్రాహ్మణ 2, ముస్లింలకు 3 లెక్కన టికెట్లు ఇచ్చారు. అయితే బీసీలకు ఇచ్చిన టికెట్లలో... యాదవ 2, కుర్మ2, ముదిరాజ్‌ 1, పద్మశాలి 1, మున్నూర్‌ కాపునకు 2 ఇచ్చారు. ఎంబీసీలకు ఇచ్చిన నాలుగింటిలో రజక, మేరు, బొందుగుల, వాల్మీకిలకు ఒక్కొక్క సీటు లెక్కన కేటాయించారు. అదేవిధంగా ఎస్సీలకు ఇచ్చిన 12 టికెట్లలో మాల-4, మాదిగ-8 లెక్కన కేటాయించారు. మొదటి జాబితా 55 నియోజక వర్గాలకుగాను ఆరుగురు మహిళలకు టికెట్లు దక్కాయి. అందులో సనత్‌నగర్‌ నుంచి- కోట నీలిమ, గోషామహల్‌ నుంచి సునీతా ముదిరాజ్‌, గద్వాల్‌ నుంచి సరిత తిరుపతియ్య స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి ఇందిర, ములుగు నుంచి సీతక్కలకు టికెట్లు దక్కాయి. తెరాస, భాజపాల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొత్తవారికి 13 మందికి ఈ మొదటి జాబితాలో టికెట్లు దక్కినట్లు తెలుస్తోంది.

సూర్యాపేట, అంబర్‌ పేట్‌, ఖైరతాబాద్‌, జూబ్లిహిల్స్‌ తదితర 20కిపైగా స్థానాలు... ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా ఆగినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఇక్కడ సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయం సాధించి టికెట్ల ప్రకటనకు మార్గం సుగమం చేసుకోనున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో వామపక్షాల పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ.. సీట్ల సర్దుబాటు కాకపోవడంతో పలు నియోజకవర్గాలకు టికెట్లు ప్రకటించకుండా నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story