Telangana: ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా హరీష్ రావు

Telangana: ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా హరీష్ రావు


మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడిపారు. నిన్న ఉదయం జీఎస్టీ సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు. సాయంత్రం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. జీఎస్టీ మండలి సమావేశంలో తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ పరిహారం 700 కోట్లు విడుదల చేయాలని కోరారు. జీఎస్టీని పీఎంఎల్‌ఏ చట్టం కిందకు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ ఫండ్స్‌ ఇతర రాష్ట్రాలకు మళ్లించిన అంశాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. గత జీఎస్టీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించామని.. అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. వెంటనే అధికారుల బృందాన్ని కానీ.. గ్రూప్ ఆఫ్‌ మినిస్టర్స్‌ గాని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సానుకూలంగా స్పందించారని హరీశ్‌ తెలిపారు.

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి హరీశ్‌రావు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు ఇవ్వాలని అభ్యర్థించారు. 2014 నుంచి 2023 వరకు పెండింగ్‌లో ఉన్న 450 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో మంత్రి హరీశ్‌రావు సమావేశమయ్యారు. విభజన చట్టం సెక్షన్ త్రీ కింద కొత్త కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరారు. సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తామని గతంలో హామీ ఇచ్చారని చెప్పారు. సమ్మక్క సారక్క, సీతమ్మ, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర మంత్రికి సమర్పించారు. పోలవరం కాలువ సైజ్ పెంచడం వల్ల తెలంగాణ వాటాకు అన్యాయం జరుగుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story