Telangana: ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్టి నుంచే..

Telangana: ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాల్టి నుంచే..
తెలంగాణలో ఎక్కడికైనా సరే..

అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల్ని అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ సర్కారు...వీటిలో రెండింటిని నేటి నుంచి ప్రారంభించనుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచనుంది. రెండు పథకాల్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ...ఆరు గ్యారెంటీల అమలుకు కీలక ముందడుగు పడింది. తొలుతగా నేటి నుంచి రెంటిండిని ప్రభుత్వం అమలు చేయనుంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో రాష్ట్ర సరిహద్దుల వరకు మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రయాణికుల ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానికత ధ్రువీకరణ గుర్తింపు కార్డు చూపిస్తే .... ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. భాగ్యనగరంలో సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించవచ్చు. ఆధార్ లాంటి ఏదో ఒక ఐడీ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడెంటీ కార్డులు అవసరం లేదన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆ తర్వాత ‘మహాలక్ష్మి స్మార్ట్‌కార్డ్’ జారీ కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తామన్నారు. 7290 బస్సు సర్వీసుల్లో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చునని.. అవసరమైతే సర్వీసులు పెంచుతామని అన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

మధ్యాహ్నం ఒంటిగంటా 30 నిమిషాలకు అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని సీఎం ప్రారంభించనున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది చరిత్రాత్మక నిర్ణయమన్న ఆయన మహిళా మంత్రులు, సీఎస్‌, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల మహిళలకు రక్షణ ఉండడమే కాకుండా ట్రాఫిక్‌ సమస్య , ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో మరో పథకమైన ఆరోగ్యశ్రీ పథకం పరిధిని ప్రభుత్వం 10 లక్షలకు పెంచనుంది. పరిధి పెంచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రారంభించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story