CONGRESS: కాంగ్రెస్‌ అధిష్టానమంతా తెలంగాణలోనే

CONGRESS: కాంగ్రెస్‌ అధిష్టానమంతా తెలంగాణలోనే
బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం... ప్రియాంక, రాహుల్‌, ఖర్గే విస్తృత ప్రచారం..

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించటమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సర్వశక్తులొడ్డుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న నేతలంతా తెలంగాణలో మోహరించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పదేళ్ల కేసీఆర్‌ సర్కార్‌ పాలనా తీరును ఎండగడుతూ ప్రధానంగా ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ జెండా ఎగరటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నేతలు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు. పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు తెలంగాణ నాయకత్వం పూర్తిగా ప్రచారంలో నిమగ్నమైంది. నిన్న రాహుల్‌గాంధీ 3నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా... ఖర్గే 2చోట్ల, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2 నియోజక వర్గాల్లో, PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 6 చోట్ల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి DKశివకుమార్‌, ఛత్తీస్‌గఢ్ CM భూపేష్‌ భగేల్‌తోపాటు ఇతర నేతలంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.


మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, AICC ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌, AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్, జైరాంరమేష్‌లు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులను పరిశీలిస్తున్న వార్‌రూం ప్రతినిధులు అందించే సమాచారం ఆధారంగా కేసీ వేణుగోపాల్‌ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిన్న నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌లలో రోడ్‌షోలతోపాటు కామారెడ్డి, పటాన్‌చెరు, శేరిలింగంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి ప్రజాసంపదను దోచుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు నోట్ల కట్టలతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.


కర్ణాటకలో 5 గ్యారంటీల అంశంపై కేసీఆర్‌ దుష్ర్పచారం చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను ఇప్పటికే తాము అమలుచేస్తున్నామన్న ఆయన కేసీఆర్‌ తమతో వస్తే చూపిస్తామని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ను గెలిపించాలంటూ నారాయణ పేట జిల్లా మక్తల్‌లో రోడ్‌షో నిర్వహించారు. ‍ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డికి మద్దతుగా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్‌ భగేల్‌ ప్రచారం నిర్వహించారు. కాజీపేటలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించిన ఆయన... మోదీ, కేసీఆర్‌ ప్రజల సంపద దోచుకోవటం తప్పిస్తే చేసిందేంలేదని ఆరోపించారు.


సూర్యాపేట జిల్లా గుడుగుంట్లపాలెం, సింగారం, ఎల్లాపురం, పాలకవీడు, జాన్‌పహాడ్‌లో హుజూర్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. AICC సంయుక్త కార్యదర్శి కన్హయ్యకుమార్ హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని పటాన్‌బస్తీలో జరిగిన కాంగ్రెస్‌ సభకు హాజరయ్యారు. అంజన్‌కుమార్‌యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన కన్హయ్య... టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా కాకుండా RSSగా మార్చుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కేసీఆర్‌ కుటుంబానికి తప్పిస్తే.... రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాలేదని కాంగ్రెస్‌ జాతీయ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story