Actress Jamuna: ప్రముఖుల సంతాపం...

Actress Jamuna: ప్రముఖుల సంతాపం...
ఫిలిం ఛాంబర్‌కు జమున భౌతికకాయం

సీనియర్‌ నటి జమున(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న జమున హైదరాబాద్‌లోని తన స్వగృహములో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. జమున మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తీసుకురానున్నారు.

జమున మృతిపట్ల పవన్‌కళ్యాణ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

"ప్రముఖ నటి, లోక్ సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమున గారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్ సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమున గారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అని పవన్‌ పేర్కొన్నారు.

జమునకు బాలయ్య సంతాపం:

"అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నింటికిమించి తెలుగు సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమున గారు. చిన్నప్పటినుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్థ్యం కనబరిచారు. కేవలం దక్షిణాది సినిమాల్లోనే కాకుండా ఆరోజుల్లోనే పలు హిందీ సినిమాల్లో నటించి ఔరా అనిపించి అందరి ప్రసంశలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున నాన్న గారు అన్నట్లు కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈరోజున జమునగారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని బాలకృష్ణ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story