Tollywood: దిల్ రాజు నయా స్ట్రాటజీ ...

Tollywood: దిల్ రాజు నయా స్ట్రాటజీ ...
సంక్రాంతికి బరిలోకి దిగుతున్న దిల్ రాజు...

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గానే కాదు స్టార్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజుకు పేరుంది. ఒకవైపు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మించే దిల్ రాజు మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గానూ అగ్ర స్థానంలో కొనసాగుతుంటాడు. ఒక సినిమాకి సంబంధించి కథ ఎంపిక మొదలుకొని ప్రతీ విషయాన్ని దగ్గరుండి పరిశీలించడమే నిర్మాతగా ఆయన సక్సెస్ కు తొలిమెట్టు. ఇక ఇప్పటివరకూ టాలీవుడ్ కే పరిమితమైన దిల్ రాజు విజయ్ 'వరిసు' సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోనూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నాడు. కోలీవుడ్ పొంగల్ రేసులో 'వరిసు' విడుదలకు ముస్తాబైంది.


'వరిసు' పేరుకు తమిళ చిత్రమే అయినా నిర్మాత దిల్ రాజు తో పాటు ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తెలుగు చిత్ర సీమకు చెందిన వాడే కావడంతో ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని తెలుగులో 'వారసుడు' పేరుతో విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జనవరి 12న విడుదలవ్వాల్సిన 'వరిసు' అజిత్ 'తునీవు' ప్రభావంతో జనవరి 11 కి ప్రీపోన్ అయ్యింది. అంతవరకూ బాగానే ఉంది.. అయితే తమిళ చిత్రం 'వరిసు' 11న వస్తుంటే తెలుగు అనువాదం 'వారసుడు' 14కి రావడమే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.



ఒకప్పుడు నిర్మాత ఎమ్.ఎస్.రాజు ని సంక్రాంతి రాజు అనే వారు. ఆ తర్వాత కాలంలో ఆ బిరుదుకి సార్థక నామధేయుడిగా మారాడు దిల్ రాజు. తాను నిర్మించిన సినిమాలను ఎక్కువగా సంక్రాంతి బరిలో నిలపడం అందుకు ఒక కారణమైతే.. తాను పంపిణీ చేసిన సినిమాలతో సంక్రాంతికి సూపర్ హిట్స్ అందుకోవడం మరో కారణం. అయితే ఈ ఏడాది సంక్రాంతి కాస్త భిన్నమనే చెప్పాలి. సంక్రాంతికి వస్తోన్న చిరంజీవి, బాలకృష్ణ రెండు సినిమాలనూ నిర్మిస్తోంది ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలను మైత్రీ వాళ్లే సొంతంగా విడుదల చేయడం మరో విశేషం. ఈనేపథ్యంలో దిల్ రాజు తన 'వారసుడు' సినిమా విషయంలో నయా స్ట్రాటజీ అవలంబిస్తున్నాడు.



'వారసుడు' సినిమా తమిళంలో జనవరి 11న విడుదలవుతోన్నా.. తెలుగులో మాత్రం జనవరి 14న తీసుకురావడానికి మరో కారణం ఉందనేది ఇండస్ట్రీ టాక్. ఒకవేళ 'వారసుడు' జనవరి 11నే విడుదలైతే.. ఆ తర్వాత వరుసగా వచ్చే బాలయ్య, చిరు సినిమాలు విజయ్ సినిమాని కమ్మేస్తాయి. థియేటర్ల విషయంలోనూ రాజీ పడక తప్పదు. దాంతో జనవరి 12, 13 తేదీలలో తన సొంత థియేటర్లను కూడా 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య'లకు ఇచ్చేసి జనవరి 14న స్థిమితంగా తన 'వారసుడు'ని తీసుకురావడమే బెస్ట్ అని భావించాడట దిల్ రాజు. పైగా చిరు, బాలయ్య రెండు సినిమాలు పక్కా మాస్ ఎంటర్ టైనర్స్ గా ఒకే జానర్ లో వస్తుంటే.. 'వారసుడు' పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది కాబట్టి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ పొందొచ్చనేది దిల్ రాజు నమ్మకం. మరి.. ప్లానింగ్ విషయంలో పక్కాగా ఉండే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కు 'వారసుడు' ఎలాంటి విజయాన్నందిస్తుందో చూడాలి.


రాంబాబు

ఎంటర్టైన్మెంట్ ఇన్ఛార్జ్

టీవీ5

Tags

Read MoreRead Less
Next Story