విష జ్వరాలకు నిలయమైన నెల్లూరు జిల్లా

విష జ్వరాలకు నిలయమైన నెల్లూరు జిల్లా

den

సీజనల్‌ వ్యాధులతో నెల్లూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే విష జ్వరాలు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు నీటి ద్వారా వ్యాపించే రోగాలు సైతం శరవేగంగా విస్తరిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఒకేసారి ప్రజలపై దాడి చేయడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాధులు విస్తరించిన తరువాత వైద్యం చేయించుకోవటం కంటే వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవడమే మేలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

జిల్లాలో పారిశుధ్య పరిస్థితి అధ్వానంగా ఉండటం.. విష జ్వరాల విజృంభణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మురికి కాలువలు, గుంతలు, నీటి నిల్వ కేంద్రాలు.. దోమల ఉత్పత్తికి నిలయాలుగా మారుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌, కావలి, గూడూరు, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలతో పాటు పంచాయతీల్లోనూ యంత్రాంగం పారిశుధ్య పరిరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో రోగాలు ప్రబలే పరిస్థితులు నెలకొన్నాయి. దోమల నివారణకు ఏటా జిల్లాలో 7 కోట్ల 88 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక్క నెల్లూరు కార్పొరేషన్‌లోనే రెండు కోట్లు వెచ్చిస్తుండగా.. గూడూరు, కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో 50 లక్షలు చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఇక జిల్లాలోని 940 పంచాయతీల్లో ఒక్కొక్క దానికి సరాసరిన 20 వేల వంతున వైద్య ఆరోగ్యశాఖ.. దోమల నివారణకు ఖర్చు చేస్తోంది. జిల్లాలోని 477 ఉప ఆరోగ్య కేంద్రాల పరిధిలో పారిశుధ్యం కోసం ఏటా 95 లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నారు. అయితే.. ఇన్ని కోట్లు ఖర్చు చేసినా దోమల నివారణ పూర్తిస్థాయిలో జరగడం లేదు.

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల కంటే ప్రైవేటు ఆసుపత్రుల వైపే బాధితులు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో 75 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 477 ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ అక్కడ సకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, టైఫాయిడ్‌, మెదడువాపు వంటి వ్యాధులు కూడా ప్రబలుతుండడంతో మామూలు జ్వరం వచ్చినా.. వైద్య పరీక్షలు, చికిత్సకు వేలల్లో ఖర్చవుతోంది.

నెల్లూరు జిల్లాలో డెంగ్యూ జ్వరంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సత్వర పరిష్కార చర్యలు చేపట్టాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలకు అవగాహన లేక జ్వరాల బారినపడిన పడుతున్నారు. ఉమ్మాయ పల్లి గ్రామంలో రవి అనే 26 ఏళ్ల యువకుడు, మర్రిపాడు మండలంలోని బాలుపల్లిలో ఆఫియా అనే ఆరేళ్ల చిన్నారి డెంగ్యూ జ్వరంతో మృతి చెందారు. మరోవైపు సంగం మండలం మర్రిపాడు గ్రామంలో విజయ భాస్కర్ అనే యువకుడు డెంగ్యూ జ్వరం బారిన పడి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యఆరోగ్యశాఖ నిర్లక్ష్యంవల్లే గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story