Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు హింస..

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఎన్నికలకు ముందు హింస..
రైలుకు నిప్పంటించిన దుండగులు.. ఐదుగురు మృతి

సార్వత్రిక ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ , దాని మిత్రపక్షాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. అయితే అవికాస్తా హింసకు దారితీశాయి. శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢాకాలోని గోపీబాగ్‌ ప్రాంతంలో బెనాపోల్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నదని, మంటలను అదుపుచేయడానికి గంటకు పైగా సమయం పట్టిందని అధికారులు వెల్లడించారు. రైలులో చాలామంది భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

జాతీయ ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనలో కుట్రకోణంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా నిప్పు పెట్టి ఉంటారా అనే కోణంలో సందేహిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదాన్ని విధ్వంస దాడిగా భావిస్తున్నామని పోలీసు చీఫ్ అన్వర్ హొస్సేన్ అన్నారు. గత నెలలో కూడా బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. రైలులో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కారణమని పోలీసులు, ప్రభుత్వ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీఎన్‌బీ తీవ్రంగా వ్యతిరేకించింది.

కాగా బంగ్లాదేశ్‌లో ఆదివారం (రేపు) జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీఎన్‌పీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని విపక్షాలు చాలా కాలంగా నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో గతేడాది చివరిలో వేలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేయించింది.

Tags

Read MoreRead Less
Next Story