UK: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ లో సమస్యలు

UK:  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ లో సమస్యలు
ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు

బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బ్రిటన్ కు రాకపోకలు సాగించే వందల విమానాలకు సమస్య ఎదురైంది. కొన్ని విమానాలను ఆలస్యంగా నడుపగా.. మరికొన్నింటిని విమానాశ్రయాలకే పరిమితం చేశారు. బ్రిటన్ తోపాటు విదేశాల్లోనూ వేలసంఖ్యలో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తింది.


సమస్య తలెత్తిన వెంటనే భద్రత దృష్ట్యా అన్ని ఎయిర్ పోర్టుల్లో విమానాల ట్రాఫిక్ నియంత్రణ ప్రారంభించినట్లు బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. సమస్య పరిష్కారం కోసం ఇంజినీర్లు పనిచేస్తున్నారని.. విమాన రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది. గగనతలాన్ని మూసేయలేదని స్పష్టం చేసింది. అత్యంత బిజీగా ఉండే రోజుల్లో ఈ ఆటంకం తలెత్తడంతో వేలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

యునైటెడ్ కింగ్‌డమ్ కి వచ్చే విమానాలతో పాటు ఆ దేశం నుంచి వెళ్లే విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని ఇతర దేశాల్లో సిద్ధంగా ఉన్న వారికి విమాన సేవలు ఆలస్యంగా అందుతాయని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి, విమానాల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.


ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. తమ సేవల తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూడాలని ప్రయాణికులకు విమానయాన సంస్థ లోగానయిర్ సూచించింది. అధికారులతో తాము చర్చిస్తున్నామని ఈజీజెట్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story