Karachi: కరాచీకి పోటెత్తిన యాచకులు

Karachi:  కరాచీకి పోటెత్తిన  యాచకులు
దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన బిచ్చగాళ్లు 4 లక్షల మంది

ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసంలో పాకిస్థాన్ పోర్టు సిటీ కరాచీ బిచ్చగాళ్లతో పోటెత్తింది. దేశం నలుమూలల నుంచి దాదాపు 4 లక్షల మంది నగరానికి చేరుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుంచి తీసుకున్న రుణాలతో పాక్‌ రోజులు నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో రంజాన్ మాసంలో పాకిస్థాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారిపోయింది. దేశంలోని నలుమూలల నుంచి 3 నుంచి 4 లక్షల మంది యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, కరాచీలోకి భారీ సంఖ్యలో బిచ్చగాళ్ల రాకపై పాక్‌కు చెందిన జియో న్యూస్‌ ఛానల్‌ ఒక నివేదికను రూపొందించింది.

రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేరాలు మరింతగా పెరిగాయని కరాచీ అడిషనల్ ఇన్ స్పెక్టర్ జనరల్(AIG) ఇమ్రాన్ యకూబ్ మిన్హాస్ తెలిపారు. సింధ్, బలూచిస్థాన్, పాక్​లోని నలుమూలల నుంచి యాచకులు భారీ సంఖ్యలో కరాచీకి తరలివచ్చారని పేర్కొన్నారు. పాత పద్ధతుల్లో నేరస్థులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

శాంతి భద్రతలు కాపాడాలి

ఇటీవలి కాలంలో కరాచీలో జరిగిన పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి నగరంలో నేరాల కారణంగా 55 మందికి పైగా మరణించారని పేర్కొన్నాయి. మరోవైపు గత కొద్ది రోజులుగా కరాచీలో పెరుగుతున్న నేరాలపై సింధ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరాచీలో ఒక నెల రోజుల్లో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని అధికారులకు అల్టిమేటం జారీ చేసింది. శాంతిభద్రతలు దిగజారడానికి కారణమైన ప్రభావవంతమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. కరాచీ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించి 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది.

Tags

Read MoreRead Less
Next Story