Beaming solar power to Earth: అంతరిక్షం నుంచి గ్రహించే సౌరశక్తితో విద్యుత్

అద్భుత సాంకేతికత దిశగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సన్నాహాలు

అంతరిక్షం నుంచే సౌరశక్తిని గ్రహించి భూమికి విద్యుత్‌ను చేరేవేసే సాంకేతికత దిశగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. అంతరిక్షంలో భారీ అద్దాలు, సౌరఫలకాలతో ఒకటిన్నర కిలోమీటరు విస్తీర్ణంతో పవర్‌ స్టేషన్‌ నిర్మించే పనిలో ఉన్నారు. పవర్‌ స్టేషన్‌ నమూనాను తయారు చేసిన శాస్త్రవేత్తలు ...2030కల్లా 10లక్షలకుపైగా నివాసాలకు విద్యుత్‌ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బ్రిటన్‌లోని క్వీన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు భవిష్యత్‌ తరం పవర్ స్టేషన్‌గా పిలిచే ఈ నమూనా పరికరాన్ని పరీక్షిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ షైర్‌కు చెందిన స్పేస్ సోలార్ సంస్థ అంతరిక్షం నుంచి నిరంతరంగా సూర్యరశ్మిని సేకరించేందుకు ఈ ప్రోటోటైప్‌ను సృష్టించింది. కాసియోపే అనే పరికరాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు స్పేస్‌ సోలార్‌ సన్నాహాలు చేస్తోంది. భూమిపై ఉండే సౌర విద్యుత్‌ స్టేషన్లు...పగలు మాత్రమే సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. వర్షాకాలంతోపాటు రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తి చేయటం అసాధ్యం. అయితే అంతరిక్షంలో కాసియోపే అనే పరికరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం సూర్యరశ్మిని గ్రహించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దాన్ని విద్యుత్‌గా మార్చి సముద్రాల్లో ఏర్పాటుచేసే రిసీవర్ స్టేషన్‌కు సరఫరా చేసే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒకటిన్నర కిలోమీటర్ల విస్తీర్ణం ఉండేలా ఈ ప్రోటోటైప్‌ నిజమైన వెర్షన్‌ను తయారుచేసి అంతరిక్ష కక్ష్యలో ఉంచాలని...స్పేస్‌ సోలార్‌ అనే సంస్థ భావిస్తోంది. భారీఅద్దాలు, సౌర ఫలకాలను ఒకదానితో ఒకటి అమర్చి... పవర్‌ స్టేషన్‌ నిర్మిస్తామని చెబుతోంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న అతిశక్తివంతమైన రాకెట్‌ స్టార్‌షిప్‌ ద్వారా ఈ పవర్‌ స్టేషన్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పేస్‌ సోలార్‌ సంస్థ తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే...పది లక్షల కంటే ఎక్కువ గృహాలకు తగినంత విద్యుత్‌ అందించవచ్చని ...శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ల్యాబ్‌లో గది అంతటా వైర్‌లెస్‌ విద్యుత్‌తో LEDని కూడా వెలిగించవచ్చని అంటున్నారు

Tags

Read MoreRead Less
Next Story